T20 World Cup 2024: బార్బడోస్ హోటల్లోనే టీమిండియా.. స్పెషల్ ఫ్లయిట్ సిద్ధం చేసిన బీసీసీఐ

T20 World Cup 2024: బార్బడోస్ హోటల్లోనే టీమిండియా.. స్పెషల్ ఫ్లయిట్ సిద్ధం చేసిన బీసీసీఐ

వెస్టిండీస్ లో ఉద్భవించిన బెరిల్ హరికేన్ కారణంగా టీమిండియా బార్బడోస్ లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. హరికేన్ కారణంగా అవుట్‌బౌండ్ విమానాలన్నీ రద్దు చేశారు. విమానాశ్రయంతో పాటు  బార్బడోస్‌లో అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. బార్బడోస్ లో ప్రస్తుతం ఎమర్జెన్సీ నడుస్తోన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు ఇండియా చేరేందుకు బీసీసీఐ చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసింది. 
 
టీమిండియా మంగళవారం సాయంత్రం (భారత కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున) చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కుతుంది. బుధవారం సాయంత్రం (జూలై 3) ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. చార్టర్డ్ ఫ్లైట్‌లో బీసీసీఐ అధికారులతో పాటు ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కుటుంబసభ్యులు కూడా ఉంటారు. చార్టర్డ్ విమానం అమెరికా నుంచి బార్బడోస్ చేరుకుంటుంది. భారత జట్టు బుధవారం (జూలై 3) రాత్రి 8 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. జులై 4 లేదా 5న ప్రధాని నరేంద్ర మోదీతో సన్మాన కార్యక్రమం ఉండొచ్చని సమాచారం.

శనివారం (జూన్ 29) బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాపై జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 11 ఏళ్ళ తర్వాత ఐసీసీ ట్రోఫీ.. 17 ఏళ్ళ తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. భారత క్రికెటర్లు ఇండియాలోకి అడుగుపెట్టగానే అభిమానులు వీరికి గ్రాండ్ గా ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. సౌతాఫ్రికాపై ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 176/7 స్కోరు చేసింది. ఛేజింగ్‌‌లో సౌతాఫ్రికా 169/8 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది.