బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ వివాదంలో చిక్కుకున్నారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు టీమిండియా ఆటగాళ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. పూర్తి ఫిట్‌గా లేని కొందరు టీమిండియా ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుని ఫిట్‌నెస్ ఉన్నట్లు చూపించి మ్యాచ్‌లు ఆడుతారని ఆయన కామెంట్ చేశారు. మాజీ కెప్టెన్ కోహ్లి , బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీల మధ్య ఇగో గొడవ ఉందని శర్మ ఆరోపించారు. తాను బీసీసీఐ కంటే ఎక్కువ అని విరాట్ భావించేవాడని చేతన్ చెప్పారు. రవిశాస్త్రి కోచ్ కావడంలో కోహ్లిది ముఖ్య పాత్ర ఉందన్నాడు.
భారత జట్టులో రెండు వర్గాలు ఉన్నాయన్న చేతన్ ... ఓ వర్గాన్ని రోహిత్ నడిపిస్తే, మరొకటి కోహ్లి నేతృత్వంలో నడుస్తుందంటూ ఆరోపణలు చేశారు. సూర్యకుమార్, ఇషాన్‌కిషన్, దీపక్ హుడా, శుభ్‌మన్ గిల్.. ఇలాంటి 15- నుంచి 20 మంది యువ ఆటగాళ్లను తానే జట్టులోకి తేచ్చానన్నాడు. చేతన్ శర్మ కామెంట్స్ పై బీసీసీఐ అధికారికంగా స్పందించకపోయిన అతనిపై చర్యలు తప్పవని తెలుస్తోంది. గత ఏడాది కాలంలో తన సెలక్షన్ నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న చేతన్ ఇటీవల చీఫ్ సెలక్టర్‌గా మరోమారు అవకాశం దక్కించుకున్నాడు.