ఈ ఏడాది భారత్ లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కేవలం పది వేదికల్లో నిర్వహించనుంది బీసీసీఐ. అయితే వరల్డ్ కప్ మ్యాచులకు ఆతిథ్యం దక్కని పలు రాష్ట్రాల క్రికెట్ బోర్డులు బీసీసీఐపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బంపరాఫర్..
వరల్డ్ కప్ మ్యాచులు నిర్వహించే అవకాశం దక్కని పలు రాష్ట్రాల క్రికెట్ స్టేడియాలకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ఆయా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు లేఖలు రాశారు. వరల్డ్ కప్ మ్యాచులకు వేదికలుగా ఎంపిక కాని స్టేడియాలకు పరిహారం ఇవ్వాలనుకుంటున్నామని లేఖల్లో జైషా తెలిపాడు. దీని కోసం బీసీసీఐ సమావేశంలో ఓ ప్రతిపాదన చేసినట్లు వెల్లడించాడు. వరల్డ్ కప్ మ్యాచులు నిర్వహించనున్న రాష్ట్రాలు.. ఆ తర్వాత భారత్ లో జరిగే మ్యాచులు నిర్వహించే అవకాశాన్ని వాలంటరీగా వదులుకోవాలన్నారు. దీనికి ఆయా రాష్ట్రాలు కూడా అంగీకారం తెలిపాయని జై షా వెల్లడించాడు.
వీటికి వర్తించదు..
బీసీసీఐ ఈ నిర్ణయం మాత్రం కేరళ, అస్సాం రాష్ట్రాలకు వర్తించదు. ఆయా రాష్ట్రాల్లో వరల్డ్ కప్ వార్మప్ మ్యాచులు జరుగుతున్నాయి. అయినా ఈ ప్రతిపాదన ఈ రెండు రాష్ట్రాలకు వర్తించదన్నాడు జైషా. వార్మప్ మ్యాచులు నిర్వహించినా... హోం సీజన్ మ్యాచులను కూడా ఈ రెండు రాష్ట్రాల స్టేడియాలు నిర్వహిస్తాయని పేర్కొన్నాడు. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ మీటింగ్ లో అందరూ ఒకే చెప్పారని తెలుస్తోంది. వరల్డ్ కప్ నిర్వహించే స్టేడియాల్లో... ఆ తర్వాత జరిగే ద్వైపాక్షిక మ్యాచులు జరగబోవన్నాడు. ఇందుకు ఆయా రాష్ట్రాలు స్వచ్ఛందంగా వదులుకున్నాయని స్పష్టం చేశాడు.