ఈశాన్య రాష్ట్రాల యువతకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శుభవార్త చెప్పింది. దేశంలోని మిగతా ప్రాంతాల వలే ఈశాన్య రాష్ట్రాలలో కూడా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం ప్రకటన చేశారు.
ముంబై వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో పాల్గొన్న జై షా విలేకరులతో మాట్లాడుతూ.. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్ వంటి క్రీడలకు అధిక ప్రాధాన్యమిచ్చే ఈశాన్య రాష్ట్రాలలో ఇకపై క్రికెట్ కూడా భాగం కానున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికల్లా నాగాలాండ్, మిజోరాం మరియు అరుణాచల్ ప్రదేశ్‌లలో క్రికెట్ అకాడమీలు ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఆ ప్రాంతాలలో క్రికెట్ అభివృద్ధిలో పురోగతి సాధిస్తామనే విశ్వాసం వ్యక్తం చేశారు.
మణిపూర్‌లో ఆలస్యం!
గతకొంతకాలంగా మణిపూర్ ఆందోళనలతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా అక్కడ క్రికెట్ అకాడమీ ఏర్పాటు ఆలస్యమయ్యే అవకాశమున్నట్లు జై షా సంకేతాలిచ్చారు.
ఆస్ట్రేలియా తరహా హై-పెర్ఫార్మెన్స్ సెంటర్
ఇక భారత క్రికెట్‌కు వెన్నుముక అయిన నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ సీఏ)సరికొత్తగా రూపుదొద్దుకుంటోంది. ఎన్‌సీఏని, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఉన్న హై పర్ఫార్మెన్స్ సెంటర్ మాదిరిగా నిర్మించనున్నారు. 2024 ఆగస్టు నాటికి ఇది పూర్తి కానుంది.