మహేంద్రుడికి అరుదైన గౌర‌వం.. నెంబర్.7 జెర్సీకి వీడ్కోలు ప‌లికిన బీసీసీఐ

మహేంద్రుడికి అరుదైన గౌర‌వం.. నెంబర్.7 జెర్సీకి వీడ్కోలు ప‌లికిన బీసీసీఐ

భారత క్రికెట్ ప్రపంచంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) పేరొక ఒక సువర్ణాధ్యాయం. ఎక్కడో రాంచీలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన ధోని.. అంచెలంచెలుగా ఎదుగుతూ భారత క్రికెట్ తలరాతనే మార్చాడు. వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ధోని సాధించిన రికార్డులను భవిష్యత్తులో ఇంకొకరు చెరిపోయొచ్చేమో కాని.. మైదానంలో అతనిలా వ్యూహాలు రచించే 'క్రికెట్ జీనియస్'ను తిరిగి పొందటమన్నది అసాధ్యం.

భారత టెస్ట్ జట్టును తొలిసారి ఐసీసీ పీఠాన్ని అధిరోహించేలా చేసిన ధోని, తన కెప్టెన్సీ మార్క్‌తో 18 నెలల పాటు దానిని అలానే కొనసాగేలా చేశాడు. 2007 నుండి 2013 మధ్య కాలంలో మూడు ఐసీసీ టైటిళ్ల(2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ)ను దేశానికి అందించాడు. అలాంటి గొప్ప ఆటగాడికి భార‌త క్రికెట్ బోర్డు(బీసీసీఐ) అరుదైన గౌర‌వం క‌ల్పించింది. మహేంద్రుడు ధ‌రించిన ఏడవ నంబ‌ర్ జెర్సీ (Jersey No 7)కి వీడ్కోలు పలికింది. ఇక‌పై జెర్సీ నంబ‌ర్‌ 7ను ఎవ‌రికి కేటాయించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది. అలాగే, ఏడవ నంబ‌ర్ జెర్సీని ఎంపిక చేసుకునే అవకాశం భార‌త క్రికెట‌ర్ల‌కు లేదని తేల్చి చెప్పింది.  

"ఎంఎస్ ధోనీ నెంబర్.7 జెర్సీని ఎవ‌రూ ఎంచుకోవ‌ద్ద‌ని ప్ర‌స్తుతం జ‌ట్టులో ఉన్న ఆట‌గాళ్లు, యువ క్రికెటర్లకు చెప్పాం. భార‌త క్రికెట్‌కు అతడు అందించిన సేవలు, కృషిని గుర్తించి అతను ధరించిన జెర్సీకి వీడ్కోలు ప‌ల‌కాల‌ని బీసీసీఐ నిర్ణ‌యింయించింది. ఇక‌పై కొత్త ఆట‌గాళ్లు నంబ‌ర్ 7 జెర్సీని ధ‌రించ‌లేరు. ఇప్ప‌టికే 10వ నంబ‌ర్ జెర్సీ(సచిన్ టెండూల్కర్)ని ప‌క్క‌న పెట్టాం.. ఒక‌వేళ ఏదేని ఆటగాడు ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం జట్టుకు దూరంగా ఉంటే, కొత్త క్రికెటర్ అతని జెర్సీ నంబర్ తీసుకోలేరు. ఆ సమయంలో అందుబాటులో ఉన్న 30 నంబ‌ర్ల‌లో ఒక‌టి ఎంచుకోవాల్సి వ‌స్తుంది.." అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

భారత జట్టు తరుపున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడిన ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. 2019 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన‌ సెమీఫైన‌ల్లో ర‌నౌట్‌గా వెనుదిరిగిన ధోనీ ఆ క్ష‌ణ‌మే ఆట‌కు వీడ్కోలు ప‌ల‌కాల‌ని నిర్ణయించుకున్నాడు. అనంతరం 2020 ఆగస్టు 15న మహేంద్రుడు త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాడు.