![Champions Trophy: భారత క్రికెటర్లకు భారీ ఝలక్.. భార్యలకు, ప్రియురాళ్లకు అనుమతి లేదు!](https://static.v6velugu.com/uploads/2025/02/bcci-denies-permission-for-families-not-allowed-to-travel-with-team-india-for-champions-trophy-2025-report_xwICcsHZoV.jpg)
దుబాయ్ వెళ్లి.. టోర్నీ ముగిశాక ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చనుకున్న భారత క్రికెటర్లకు భారీ షాక్ తగిలింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆటగాళ్లతో పాటు వారి కుటుంబసభ్యులను అనుమతించడానికి బీసీసీఐ నిరాకరించినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, సీనియర్ క్రికెటర్లలో ఒకరు ఈ విషయం గురించి ఆరా తీయగా.. బీసీసీఐ అధికారులు అతనికి కొత్త రూల్స్ గుర్తు చేసినట్లు సమాచారం.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో 3-1 తేడాతో ఓటమి పాలయ్యాక.. బీసీసీఐ 10 పాయింట్లతో కూడిన కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇందులో ఒకటి.. క్రికెటర్ల భార్యలు, ప్రియురాళ్ల గురించే. టీమిండియా విదేశీ పర్యటనల సమయంలో క్రికెటర్ల వెంట కుటుంబ సభ్యుల బసపై బీసీసీఐ పరిమితులు విధించింది. టోర్నీ 45 రోజుల కంటే ఎక్కువ రోజులైతే.. భాగస్వామి, పిల్లలు రెండు వారాలు ఉండొచ్చు. 45 రోజుల కంటే తక్కువైతే.. కేవలం వారం రోజులు మాత్రమే అనుమతి. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ కేవలం 15 రోజుల టోర్నీ కనుక బీసీసీఐ అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.
Also Read :- మహిళల పోరుకు వేళాయె.. 22 రోజులు, 22 మ్యాచ్‌లు
“ఛాంపియన్స్ ట్రోఫీ పర్యటన నెల కన్నా తక్కువ సమయం ఉన్నందున, కుటుంబసభ్యులు ఆటగాళ్లతో పాటు రారు. కానీ మినహాయింపులు ఇస్తే, సదరు క్రికెటర్ పూర్తి ఖర్చులు భరించాల్సి ఉంటుంది. బీసీసీఐ ఎటువంటి ఖర్చులు భరించదు..” అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.