ICC Champions Trophy 2025: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరును ముద్రించేందుకు వీలు లేదు: బీసీసీఐ

ICC Champions Trophy 2025: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరును ముద్రించేందుకు వీలు లేదు: బీసీసీఐ

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ లో అడుగుపెట్టకుండా హైబ్రిడ్ మోడల్ లో మ్యాచ్ లు ఏర్పాటు చేసుకున్న బీసీసీఐ.. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా జెర్సీలపై 'పాకిస్థాన్' పేరును ముద్రించడానికి నిరాకరించింది. దీంతో బీసీసీఐ కొత్త వివాదంలో చిక్కుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మెగా ఈవెంట్ కు పాకిస్థాన్ అధికారికంగా ఆతిధ్యమిస్తుంది. అయితే హైబ్రిడ్ మోడల్ ప్రకారం భారత్ తమ మ్యాచ్ లన్ని దుబాయ్ వేదికగా ఆడుతుంది. 

రూల్స్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే జట్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు కచ్చితంగా ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన ఐసీసీ టోర్నీలో ఇదే జరిగింది. అయితే టీమిండియా జట్టు జెర్సీపై ‘పాకిస్తాన్’ పేరు ముద్రించచడానికి వెనక్కి వెనక్కి తగ్గింది. బీసీసీఐ నిర్ణయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బీసీసీఐ క్రికెట్‌లోకి రాజకీయాలను తీసుకొచ్చిందని పీసీబీ అధికారి ఒకరు ఆరోపించారు. సంవత్సరాలుగా వారి రాజకీయ గందరగోళం కారణంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరగట్లేదని పాక్ క్రికెట్ బోర్డు బీసీసీపై మండిపడుతుంది. 

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ.. " బీసీసీఐ క్రికెట్‌లోకి రాజకీయాలను తీసుకువస్తోంది. ఇది ఆటకు ఏమాత్రం మంచిది కాదు. వారు పాకిస్తాన్‌లో పర్యటించడానికి నిరాకరించారు. ఇప్పుడు వారు తమ జెర్సీపై ఆతిథ్య దేశం (పాకిస్తాన్) పేరును ముద్రించకూడదని చెబుతున్నారు. ఐసీసీ బీసీసీఐకు ఈ విషయంలలో మద్దతు ఇవ్వదని మేము నమ్ముతున్నాము". అని ఆయన అన్నారు. 

Also Read :- నలుగురు పేసర్లతో బట్లర్ సేన.. భారత్‌తో తొలి టీ20కి ఇంగ్లాండ్ జట్టు ప్రకటన

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ వేడుకల కోసం రోహిత్ పాకిస్థాన్‌కు పంపడానికి సిద్ధంగా లేనట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 16 లేదా 17న ఛాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకను నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తుంది. ఈ మెగా ఈవెంట్ కు కెప్టెన్లందరూ హాజరు కావాలని పీసీబీ భావిస్తోందట. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిధ్యమివ్వడం.. డిఫెండింగ్ ఛాంపియన్ కూడా పాకిస్థాన్ కావడంతో ఆ దేశానికి ఈ టోర్నీ ప్రత్యేకంగా మారనుంది.

ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు.. అంటే 19 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా ఆతిథ్య పాకిస్థాన్ జట్టు.. ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత జట్టు.. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది.