ఎంపీల క్లబ్కు బీసీసీఐ భారీగా విరాళం ఇచ్చింది. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాకు బీసీసీఐ రూ. 2.25 కోట్లు విరాళం అందించింది. ఈ క్లబ్ లో జిమ్ పరికరాల కొనుగోలు కోసం బీసీసీఐ ఈ భారీ మొత్తాన్ని విరాళంగా చెల్లించింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి 2022 డిసెంబర్‌లో జిమ్ పరికరాల కొనుగోలు కోసం కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి రూ.2.25 కోట్లు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది.
డిసెంబర్ 21, 2022 న జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బోర్డు కార్యదర్శి జైషా ప్రతిపాదనను బోర్డు ముందు ఉంచారు. జిమ్ పరికరాల కొనుగోలు కోసం కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా నిధులు కోరిందని..అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో వెల్లడించారు. అయితే సీసీఐకి ఒకేసారి రూ.2.25 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు ఈ మీటింగ్ లో బీసీసీఐ ఆమోదం తెలిపింది.
ఢిల్లీలో కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా 1947 ఫిబ్రవరిలో ప్రారంభమైంది.ఎంపీల మధ్య సామాజిక సంబంధాలను ప్రోత్సహించడంతో పాటు..చర్చా వేదికగా ఈ క్లబ్ ను మొదలుపెట్టారు. ఢిల్లీలోని విఠల్ భాయ్ పటేల్ హౌస్‌లో ఉన్న కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. ఉపాధ్యక్షుడిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి, జనరల్ సెక్రటరీగా హరివంశ్ సింగ్ ఉన్నారు.