MS Dhoni: ధోనిపై బీసీసీఐకి ఫిర్యాదు.. ఎథిక్స్ కమిటీ నుంచి నోటీసులు

భార‌త మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి న్యాయపరమైన చిక్కులు ఎదురవవుతున్నాయి. లెజెండరీ క్రికెటర్ ధోనిపై బిసిసిఐకి అధికారిక ఫిర్యాదు దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌, అమేథికి చెందిన రాజేష్ కుమార్ మౌర్య అనే ఫిర్యాదుదారుడు బీసీసీఐ ఎథిక్స్ కమిటీలోని రూల్ 39 కింద మాజీ కెప్టెన్‌పై పలు అభియోగాలు మోపారు. దీనిపై స్పందించాల్సిందిగా భారత మాజీ కెప్టెన్‌కు ఎథిక్స్ కమిటీ 19 రోజుల గడువిచ్చింది. 

ఈ కేసు ధోని- ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థ, దాని డైరెక్టర్లు మిహిర్ దివాకర్ మధ్య కొనసాగుతున్న రూ. 15 కోట్ల వివాదానికి సంబంధించినది అయినప్పటికీ, ఆ కేసులో అభియోగాలు మాజీ కెప్టెన్‌పై మోపబడలేదు. క్రికెటర్‌గా ధోని జాతీయ జట్టులో కొనసాగుతున్న సమయంలో బీసీసీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌లోని రూల్ రూల్ 38(4)ని ఉల్లంఘించి, ఒప్పందాలు చేసుకున్నాడని ఫిర్యాదుదారు బీసీసీఐ ఎథిక్స్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. 

ఆగస్టు 30 గడువు

రాజేష్ కుమార్ మౌర్య ఫిర్యాదుపై అధికారిక ప్రతిస్పందనను దాఖలు చేయాలని బీసీసీఐ (BCCI) ఎథిక్స్ కమిటీ ధోనీకి ఆగస్ట్ 30, 2024 వరకూ గడువిచ్చింది. అలాగే, ధోని రివర్ట్‌పై అధికారిక ప్రతిస్పందనను సమర్పించడానికి రాజేష్ కుమార్ మౌర్యకు సెప్టెంబర్ 16, 2024 వరకు సమయమిచ్చింది. ఈ కేసుపై సెప్టెంబర్ 16న విచారణ జరగనుంది.

కాగా, ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ధోని  చెన్నై సూప‌ర్ కింగ్స్ జట్టుకు ఫినిష‌ర్‌గా మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు. అయితే, మోకాలి గాయం కారణంగా ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయలేక చివరి రెండు, మూడు ఓవర్లలోనే బ్యాటింగ్ కు వచ్చేవాడు. ఈ నేపథ్యంలో 18వ సీజ‌న్‌లో మ‌హీ ఆడ‌డంపై సందేహాలు నెలకొన్నాయి. వ‌చ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం ఉంది. అందుక‌ని ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌గా కొన‌సాగించాలా? అనే విష‌య‌మై సీఎస్కే యాజ‌మాన్యం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది.