న్యూఢిల్లీ : లెజెండరీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరికొంత కాలం టీమిండియా హెడ్ కోచ్‌గా కొనసాగనున్నాయి. రాహుల్‌తో పాటు మిగతా కోచింగ్ సిబ్బంది కాంట్రాక్టులను పొడిగిస్తున్నట్టు బీసీసీఐ బుధవారం ప్రకటించింది. దాంతో, వరల్డ్ కప్ ఫైనల్లో జట్టు ఓడిపోవడంతో కోచ్‌గా ద్రవిడ్ ఫ్యూచర్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడినట్టయింది. ద్రవిడ్ గైర్హాజరీలో ఆసియా కప్, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కోచ్‌గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ ఎన్‌సీఏ హెడ్‌గా కొనసాగుతాడని బోర్డు తెలిపింది.
అయితే, ద్రవిడ్ ఎంత కాలం కోచ్‌గా కొనసాగుతాడనే విషయాన్ని మాత్రం బోర్డు వెల్లడించలేదు. ‘హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, టీమిండియా సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్టులను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్‌తో హెడ్ కోచ్‌గా ద్రవిడ్ కాంట్రాక్ట్ గడువు ముగిసింది. ఆ తర్వాత ద్రవిడ్‌తో చర్చించి తన పదవీకాలాన్ని కొనసాగించడానికి ఏకగ్రీవంగా అంగీకరించింది’ అని బోర్డు తన ప్రకటనలో పేర్కొన్నది. ద్రవిడ్‌కు బోర్డు పూర్తి మద్దతు ఉంటుందని, గత పదేళ్లుగా ఇండియా అందుకోలేకపోతున్న ఐసీసీ ట్రోఫీని గెలవడానికి తన ప్రయత్నంలో ముందుకు సాగుతుందని బీసీసీఐ సెక్రటరీ జై షా అన్నారు.
తన కాంట్రాక్టు కొనసాగించడంపై ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘టీమిండియాతో గత రెండేండ్లుగా నా ప్రయాణం ఎంతో చిరస్మరణీయమైనది. ఇందులో మేం హెచ్చు తగ్గులను చూశాము. అయినా ఈ ప్రయాణంలో ఆ జట్టులోని అందరి మద్దతు, స్నేహం మాత్రం అసాధారణం’ ద్రవిడ్ చెప్పాడు. వరల్డ్ కప్ తర్వాతి దశలో టీమ్ అత్యుత్తమంగా రాణించేందుకు, రాబోయే కొత్త సవాళ్లను స్వీకరించేందుకు తాను కట్టుబడి ఉంటానని ద్రవిడ్ స్పష్టం చేశాడు.
టీ20 వరల్డ్ కప్ వరకు
క్రికెటర్‌గా ఓ వెలుగు వెలిగిన ద్రవిడ్ 2021లో జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత రవిశాస్త్రి స్థానంలో రెండేండ్ల కాంట్రాక్టుతో హెడ్ కోచ్‌గా వచ్చి తన మార్కు చూపెట్టాడు. దాంతో ఊహించనట్టుగానే అతని కాంట్రాక్టును బోర్డు కొనసాగించింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్‌లతో కూడిన సహాయక సిబ్బందికి కూడా పొడిగింపు లభించింది. వచ్చే ఏడాది జూన్– -జులైలో వెస్టిండీస్, అమెరికాలో జరిగే టీ20 వరల్డ్ కప్ వరకు ద్రవిడ్ అండ్ కో కాంట్రాక్టు ఉంటుందని తెలుస్తోంది.
వన్డే వరల్డ్ కప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న ద్రవిడ్‌ను సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియా నడిపించాలని బోర్డు ఇది వరకే కోరినట్టు సమాచారం. కాగా, ద్రవిడ్ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అతని బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ ఎన్‌సీఏ హెడ్‌గా కొనసాగనున్నాడు. తనకు ఇండియా–ఎ, ఇండియా అండర్–19 వంటి జట్లతో కలిసి పనిచేయడం మరింత సౌకర్యంగా ఉందని లక్ష్మణ్ బీసీసీఐ పెద్దలకు చెప్పినట్టు తెలుస్తోంది.
‘ఎన్‌సీఏ హెడ్‌గా, స్టాండ్-ఇన్ హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ని కూడా బోర్డు అభినందిస్తుంది. ఇదివరకు మైదానంలో తమ భాగస్వామ్యం మాదిరిగానే ఇండియన్ క్రికెట్‌ను ముందుకు నడిపించడంలో ద్రవిడ్, లక్ష్మణ్ కలిసికట్టుగా పనిచేస్తున్నారు’ అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొన్నది. ప్రస్తుతానికి ఇద్దరూ తమ తమ పాత్రల్లోనే కొనసాగుతారని స్పష్టం చేసింది. బోర్డు–హెడ్ కోచ్‌కు మధ్య వారధిగా ఉన్న బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
నెహ్రా నో చెప్పాడా?
ఒకవేళ ద్రవిడ్‌కు ఎక్స్‌టెన్షన్ ఇవ్వకపోతే టీమిండియా హెడ్ కోచ్‌గా పని చేయాలని మాజీ పేసర్ ఆశీష్ నెహ్రాను బోర్డు పెద్దలు సంప్రదించినట్టు తెలుస్తోంది. నెహ్రా ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా పని చేస్తున్నాడు. టైటాన్స్‌తో 2025 వరకు అతనికి కాంట్రాక్ట్ ఉంది. ఈ ఒప్పందాన్ని గౌరవించాలని నెహ్రా నిర్ణయించుకున్నాడు. టీమిండియా హెచ్ కోచ్‌గా వస్తే చిన్నవాళ్లైన తన కొడుకు, కూతురును విడిచిపెట్టి తరచూ ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉండటంతో బోర్డు పెద్దల ప్రపోజల్‌కు నెహ్రా నో చెప్పాడని సమాచారం. అయితే, భవిష్యత్తులో ఇండియా వైట్ బాల్ టీమ్‌కు నెహ్రాను కోచ్‌గా పరిగణించే అవకాశం లేకపోలేదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.