హైదరాబాద్, వెలుగు: వన్డే వరల్డ్ కప్‌లో హైదరాబాద్‌లో టీమిండియా మ్యాచ్ లేదని నిరాశ చెందిన భాగ్యనగర క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. 2023–24 టీమిండియా హోమ్ సీజన్‌లో హైదరాబాద్‌కు రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు కేటాయించింది. డిసెంబర్ 3న ఆస్ట్రేలియాతో టీ20 ఐదో మ్యాచ్, జనవరి 25–29 మధ్య ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు సెప్టెంబర్ నుంచి వచ్చే మార్చి వరకు ఇండియాలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ టూర్స్ షెడ్యూల్‌ను బోర్డు మంగళవారం రిలీజ్ చేసింది. ఇందులో 16 మ్యాచ్‌లు (5 టెస్టులు, 3 వన్డేలు, 8 టీ20లు) ఉన్నాయి. తొలుత ఆస్ట్రేలియా మూడు వన్డేలు, ఐదు టీ20ల్లో ఇండియాతో పోటీ పడనుంది. సెస్టెంబర్ 22 (మొహాలీ), 24 (ఇండోర్), 27వ (రాజ్‌కోట్)తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. నవంబర్ 23 (వైజాగ్), 26 (త్రివేండ్రం), 28 (గువాహతి), డిసెంబర్ 1 (నాగ్‌పూర్), 3వ (హైదరాబాద్) తేదీల్లో ఐదు టీ20లు షెడ్యూల్ చేశారు.
ALSO READ :చెస్ వరల్డ్ కప్ బరిలో అర్జున్, హర్ష
ఇక, మూడు టీ20ల సిరీస్ కోసం ఇండియా రానున్న అఫ్గాన్ జనవరి 11 (మొహాలీ), 14 (ఇండోర్), 17వ (బెంగళూరు) తేదీల్లో ఈ మ్యాచ్‌లు ఆడనుంది. ఆపై, జనవరి నుంచి మార్చి వరకు ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్‌లో పోటీ పడనుంది. ఇందులో మొదటి టెస్టు (జనవరి 25–29) హైదరాబాద్‌లో జరగనుంది. రెండో టెస్టుకు వైజాగ్ (ఫిబ్రవరి 2-–6) ఆతిథ్యం ఇవ్వనుంది. రాజ్‌కోట్ (ఫిబ్రవరి 15–19), రాంచీ (ఫిబ్రవరి 23–27), ధర్మశాల (మార్చి 7–11)లో చివరి మూడు టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి..