టీ20 లకు కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్..? బీసీసీఐ ఏం చెప్పిందంటే..?

టీ20 లకు కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్..? బీసీసీఐ ఏం చెప్పిందంటే..?

టీ20 క్రికెట్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కనిపించి ఏడాది దాటిపోయింది. రోహిత్, విరాట్ చివరి సారిగా 2022 వరల్డ్ కప్ లో భారత జట్టు తరపున తమ చివరి టీ20 మ్యాచ్ ఆడారు. గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ పై భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మెగా టోర్నీ తర్వాత ఈ స్టార్ ప్లేయర్లను సెలక్టర్లు పక్కన పెట్టేసారు. అప్పటి నుంచి విరాట్, రోహిత్ టీ20 లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 

ఈ క్రమంలో తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్య భారత జట్టును నడిపిస్తున్నాడు. దీంతో 2024లో టీ20 వరల్డ్ కప్ కు వీరిద్దరూ జట్టులో ఉండడం కష్టమే అని అందరూ భావించారు. ప్రస్తుతం రోహిత్ వయసు 36 కాగా.. కోహ్లీకి 35 సంవత్సరాలు. క్రికెట్ లో కొనసాగుతున్న ఈ ద్వయం మూడు ఫార్మాట్ లలో కొనసాగటం కష్టమేనని.. కోహ్లీ, రోహిత్ టీ 20లకు రిటైర్మెంట్ కెరీర్ ముగిసిపోయిందని కొన్ని నెలలుగా   వార్తలు ఊపందుకున్నాయి. దీనికి తోడు తాజాగా రోహిత్ శర్మ సెలక్టర్లకు నన్ను టీ20 లకు పరిగణించకపోయినా పర్లేదు అని చెప్పేసరికీ రోహిత్ టీ 20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడం ఖాయమని భావించారు.

హార్దిక్ పాండ్యను సిద్ధంగా ఉంచి కోహ్లీ, రోహిత్ లను సాగనంపే ప్రయత్నాలు చేస్తున్నట్లు బీసీసీఐ ప్లాన్ వేసిందని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీరిద్దరి టీ 20 క్రికెట్ భవిష్యత్తుపై బీసీసీఐ ఒక కీలక ప్రకటన చేసినట్టు సమాచారం. జట్టులో కొనసాగే విషయంలో పూర్తి స్వేచ్ఛ నిచ్చింది. వీరిద్దరూ ఆడినంత కాలం జట్టులో ఉంటారని భరోసాను ఇచ్చింది. దీంతో విరాట్, రోహిత్ ఇద్దరూ కూడా 2024 టీ20ల్లో కొనసాగటం ఖాయంగా కనిపిస్తుంది. 

భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉంటున్న హార్దిక్ పాండ్య చీలమండ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఎప్పుడు ఫిట్ నెస్ సాధిస్తాడో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో రోహిత్  2024 టీ20 వరల్డ్ కప్ కు కెప్టెన్ గా ఉండడం దాదాపు ఖాయమైంది. మరోవైపు కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. తాజాగా జరిగిన వరల్డ్ కప్ లో అసాధారణ ఆట తీరుతో ఏకంగా 765 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫిట్ నెస్ పరంగా విరాట్ కు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో కోహ్లీ వచ్చే ఏడాది వరల్డ్ కప్ ఆడటంతో ఎలాంటి సందేహం లేదు. 

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు రోహిత్, విరాట్ కు రెస్ట్ ఇచ్చినా.. ప్రపంచ కప్ లాంటి ప్రధాన టోర్నీల్లో వీరిద్దరిని పక్కన పెట్టే సాహసం ఎవరూ చేయరు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని బీసీసీఐ వీరికే వదిలిపెట్టడంతో వీరిని జట్టులో నుంచి తప్పించరు అని స్పష్టంగా తెలుస్తుంది.