- బుమ్రాకు రెస్ట్ ఎలా ఇచ్చారు..
- న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి.. గంభీర్, రోహిత్‌తో బీసీసీఐ రివ్యూ
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయంపై బీసీసీఐకి, కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌కు మధ్య హాట్‌హాట్ చర్చ జరిగింది. ఈ సిరీస్ వైఫల్యంపై బోర్డు ఆరు గంటల పాటు రివ్యూ చేసింది. ముంబైలో జరిగిన మూడో టెస్టుకు స్పిన్ పిచ్‌ను ఎంపిక చేయడం, వైస్ కెప్టెన్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వడం, గంభీర్ కోచింగ్ శైలిపై ఇందులో సమగ్రంగా చర్చించారు. బోర్డు ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా ఈ సమావేశానికి హాజరు కాగా, గౌతీ ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు.
సిరీస్ సందర్భంగా టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ద్రవిడ్‌తో పోలిస్తే గౌతీ కోచింగ్ స్టైల్ భిన్నంగా ఉండటం, దానికి టీమ్ ఎలా అలవాటు పడుతుందనే అంశంపై కూడా చర్చ జరిగింది. ‘ఆసీస్ టూర్ నేపథ్యంలో ఈ రివ్యూ చాలా హాట్‌గా నడిచింది. టీమ్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు గంభీర్, రోహిత్, అగార్కర్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఆసక్తికర చర్చ జరిగింది’ అని బోర్డు సీనియర్ మెంబర్ ఒకరు వెల్లడించారు.
మూడో టెస్టుకు స్పిన్ పిచ్‌ను ఎన్నుకోవడం, అదే మ్యాచ్‌లో బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంపై బీసీసీఐ పెద్దలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే బుమ్రాకు రెస్ట్ ఇచ్చామని కోచ్, కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరాజయం నుంచి కోలుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇవ్వాలని ఈ ముగ్గుర్ని బోర్డు కోరినట్లు తెలుస్తోంది. గౌతీ కోచింగ్ స్టైల్‌పై బోర్డుపెద్దలు అసంతృప్తితో ఉన్నట్లు సమచారం. ఇక రంజీల్లో 10 మ్యాచ్‌లే ఆడిన నితీశ్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణాను టెస్టు టీమ్‌లోకి తీసుకోవడంపై ఏకాభిప్రాయం కుదరలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.