BCCI: భారత క్రికెట్ జట్టుకు హెడ్‌ కోచ్‌ కావలెను.. అర్హతలివే

BCCI: భారత క్రికెట్ జట్టుకు హెడ్‌ కోచ్‌ కావలెను.. అర్హతలివే

భార‌త క్రికెట్ సీనియ‌ర్ పురుషుల జ‌ట్టు హెడ్ కోచ్ పదవికి భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు సోమ‌వారం(మే 13) ప్ర‌ట‌క‌న విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం భారత జట్టు కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ప‌ద‌వీకాలం టీ20 వ‌ర‌ల్డ్‌ క‌ప్‌తో ముగియనుంది. అంటే జూన్ చివ‌రి నాటికి ద్రవిడ్ కోచ్‌ పదవి నుంచి వైదొలుగుతారు. దీంతో బీసీసీఐ.. కొత్త కోచ్ కోసం అన్వేషణ చేపట్టింది.

వన్డే ప్రపంచ కప్ 2023 అనంతరం టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ద్రవిడ్ పదవి కాలాన్ని ఒకసారి పొడిగించారు. ఈసారి పొడిగింపు ఇవ్వలేదు. అతను కోచ్ గా ఉండాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా ఇటీవల వెల్లడించారు. అయితే, అందుకు 'ది వాల్' సుముఖంగా లేడనే వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త హెడ్ కోచ్ ప‌ద‌వీకాలం మూడున్నర సంవత్సరాలు (2024 జులై 1 నుంచి 2027 డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు) ఉంటుంద‌ని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది. అంటే కొత్త‌ కోచ్ ప‌ద‌వికి ఎంపికైన వ్య‌క్తి 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు భార‌త జ‌ట్టుకు ప్ర‌ధాన కోచ్‌గా కొన‌సాగనున్నారు.

బీసీసీఐ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. "కొత్త కోచ్‌కు 14 నుంచి16 మంది సహాయక సిబ్బంది సహాయంగా ఉంటారు. మూడు ఫార్మాట్లలో జట్టుకు హెడ్‌ కోచ్ గా కొన‌సాగుతారు. జట్టు ప్రదర్శన, నిర్వహణకు పూర్తి బాధ్యత.. కోచ్‌దే. అలాగే స్పెషలిస్ట్ కోచ్‌లు, సహాయక సిబ్బంది బృందానికి ఆయనే నాయకత్వం వహిస్తారు.." అని బీసీసీఐ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

కోచ్‌ కావాలనుకునే వారికి ఉండాల్సిన అర్హతలు

  • 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండాలి.
  • కనీసం 30 టెస్ట్లు లేదా 50 వ‌న్డేలు (లేదా) ఆడి ఉండాలి.
  • టెస్టు క్రికెట్ ఆడే దేశానికి ప్రధాన కోచ్‌గా కనీసం 2 సంవత్సరాల పాటు ప‌నిచేసిన అనుభ‌వం (లేదా)
  • ఐపీఎల్‌/ ఇంటర్నేషనల్ లీగ్/ఫస్ట్ క్లాస్ జట్టు/జాతీయ ఏ జ‌ట్ల‌కు ప్రధాన కోచ్‌గా కనీసం మూడేళ్లు ప‌నిచేసిన అనుభవం (లేదా)
  • బీసీసీఐ లెవల్ 3 సర్టిఫికేషన్ తప్పనిసరి

పై అర్హతలు ఉండి.. ఆసక్తి గల వారు మే 27న సాయంత్రం 6 గంటల్లోపు బీసీసీఐ ఇచ్చిన లింక్‌లో తమ వివరాలు పొందుపరచాలి.

రేసులో వీవీఎస్ లక్ష్మణ్

ప్రస్తుత భారత పురుషుల జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు సుముఖంగా లేనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో అతని స్థానంలో హైదరాబాద్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ తదుపరి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం లక్ష్మణ్ ఎన్‌సీఏ డైరెక్టర్‌గా  బాధ్యతలు నిర్వహిస్తూనే.. అండర్ 19, భారత్ ఏ జట్లకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.