BCCI central contracts: ఒక్కడికే A+ కేటగిరి.. రోహిత్, కోహ్లీ, జడేజాలకు బీసీసీఐ షాక్!

BCCI central contracts: ఒక్కడికే A+ కేటగిరి.. రోహిత్, కోహ్లీ, జడేజాలకు బీసీసీఐ షాక్!

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు ప్రకటించే సమయం దగ్గర పడింది. సోమవారం (మార్చి 24) బీసీసీఐ భారత మహిళల సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌‌‌‌ స్మృతి మంధాన, ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ దీప్తి శర్మ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో గ్రేడ్‌‌‌‌–ఎలో తమ చోటు నిలబెట్టుకున్నారు. అయితే మెన్స్ జట్టులో మాత్రం.. ఏ కేటగిరితో పాటు ఏ ప్లస్ కేటగిరి కూడా ఉంటుంది. మూడు ఫార్మాట్ లు ఆడుతూ అత్యుత్తమంగా రాణించిన వారికి ఈ కాంట్రాక్ట్ దక్కుతుంది. టీమిండియాలో కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, జడేజాలు ఏ ప్లస్ కేటగిరిలో కొనసాగుతున్నారు. 

2024-2025 లో మాత్రం వీరికి ఏ ప్లస్ కేటగిరి అందడం కష్టంగానే కనిపిస్తుంది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ, రోహిత్ లతో పాటు జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. మూడు ఫార్మాట్ లలో ఆడి ఫామ్ లో ఉంటేనే వారికి ఏ ప్లస్ కేటగిరి అందుతుంది. ఈ ముగ్గురికి ఏ ప్లస్ కేటగిరికి అర్హులు కాదని ప్రస్తుతం కొంతమంది బీసీసీఐ అధికారులు చర్చిస్తున్నారు. అదే జరిగితే బుమ్రా ఒక్కడే ఏ ప్లస్ కేటగిరిని అర్హుడు. బుమ్రా మూడు ఫార్మాట్ లలో టీమిండియాకు కీలక బౌలర్. మరోవైపు గత ఏడాది క్రమశిక్షణ రాహిత్యంతో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్ ఈసారి ఏదో ఒక విభాగంలో ఎంపికవ్వడం గ్యారంటీ. 

టీ20ల్లో వైస్ కెప్టెన్ గా ఎంపికైన అక్షర్ పటేల్ తో పాటు గత ఏడాది టెస్టుల్లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ యశస్వి జైశ్వాల్ బి కేటగిరి నుంచి ఏ కు ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. బెంగాల్ స్పీడ్‌స్టర్ ఆకాష్ దీప్, సర్ఫరాజ్ ఖాన్‌లను గ్రూప్ సిలో చేర్చనున్నట్టు సమాచారం. శార్దూల్ ఠాకూర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషాన్ సెంట్రల్ కాంట్రాక్ట్ కు ఎంపికయ్యే సూచనలు కనిపించడం లేదు. ఏ ఆటగాడైనా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోకి రావాలంటే.. అతను తదుపరి సీజన్‌కు పరిగణించబడాలంటే ఒక క్యాలెండర్ సంవత్సరంలో మూడు టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా 10 టీ20లు ఆడాలి.