- చాంపియన్స్ ట్రోఫీలో తేడా వస్తే ఇంటికే..
- సిడ్నీ టెస్ట్ కోసం భారీ మార్పులు
న్యూఢిల్లీ: భారీ అంచనాలతో రాహుల్ ద్రవిడ్ వారసుడిగా టీమిండియా చీఫ్ కోచ్ పగ్గాలు చేపట్టిన గౌతమ్ గంభీర్‌కు ఇప్పుడు ఎదురుగాలి వీస్తోంది. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో టీమిండియా పెర్ఫామెన్స్‌పై బీసీసీఐ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. సిడ్నీ టెస్ట్‌లో రోహిత్‌సేన ప్రదర్శన మెరుగుపడకపోతే గంభీర్‌ను కొనసాగించే అవకాశాలు మరింత క్లిష్టంగా మారనున్నాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 0–3తో చేజార్చుకుంది.
దీంతో అప్పుడే గంభీర్ కోచింగ్ శైలిపై కొంత సందేహాలు వచ్చినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆసీస్ టూర్‌లో ఇండియా 1–2తో వెనకబడటం, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధిస్తుందో? లేదో? అన్న అనుమానాలు మొదలుకావడంతో గౌతీ కోచింగ్‌పై విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇవేమి పట్టించుకోకుండా గంభీర్ తనకు నచ్చిన రీతిలో జట్టు లైనప్‌లో మార్పులు చేసుకుంటూ వెళ్లాడు. కానీ ఫలితాల్లో తేడా రావడంతో ఇప్పుడు సరిదిద్దే ప్రయత్నంలో పడ్డాడు.
సిరాజ్, రిషబ్ ఔట్!
సిడ్నీలో రేపటి నుంచి జరిగే ఐదో టెస్ట్ కోసం జట్టులో మార్పులు చేయాలని గంభీర్ భావిస్తున్నాడు. కీలక టైమ్‌లో పేలవ షాట్లు ఆడుతున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో పాటు పేసర్ మహ్మద్ సిరాజ్‌ను తప్పించాలని యోచిస్తున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో పంత్ 154 రన్సే చేశాడు. ఇందులో ఒక్క ఫిఫ్టీ కూడా లేదు. అలాగే ప్రతి మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు.
ఇక ఈ సిరీస్‌లో 16 వికెట్లు తీసిన సిరాజ్.. బుమ్రాకు తగినంత సపోర్ట్ ఇవ్వడంలో విఫలమవుతున్నాడు. దానికి తోడు నాలుగు మ్యాచ్‌ల్లో 503 రన్స్ ఇచ్చుకోవడం ప్రతికూలంగా మారింది. వీళ్ల ప్లేస్‌ల్లో శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలి మూడు టెస్ట్‌లకు ఎక్స్‌ట్రా పేసర్‌తో ఆడిన టీమిండియా.. నాలుగో టెస్ట్‌లో ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను బరిలోకి దించింది . కానీ ఈ ప్రయోగం ఫెయిల్ కావడంతో మళ్లీ ఎక్స్‌ట్రా పేసర్‌తోనే సిడ్నీలో ఆడే చాన్స్ కనిపిస్తోంది. అయితే పిచ్‌ను బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
‘చాంపియన్స్’లో ఎలా?
ఆస్ట్రేలియాతో ఐదో టెస్ట్ ముగిసిన తర్వాత టీమిండియా ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. ఇందులో ఫలితం తేడా వస్తే గంభీర్ కోచ్ పదవికి కచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఈ టోర్నీలో టీమ్ పెర్ఫామెన్స్ కూడా మెరుగుపడాల్సిందే. కోరుకున్న ప్లేయర్లను ఎంపిక చేసినా వాళ్ల నుంచి పెర్ఫామెన్స్‌ను రాబట్టడంలో కోచ్‌గా గంభీర్ ఫెయిలవుతున్నాడు. ముఖ్యంగా సీనియర్లు కోహ్లీ, రోహిత్ బ్యాటింగ్ వైఫల్యానికి సరైన కారణాలు వెతకలేకపోతున్నాడు. యంగ్‌స్టర్స్ మంచిగా ఆడుతున్నా.. లైనప్‌లో మార్పులు చేర్పులు చేస్తూ వాళ్లకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదు. శుభ్‌మన్ గిల్ ఉదంతమే ఇందుకు నిదర్శనం. మరి గంభీర్ టీమ్‌పై తన ముద్ర వేస్తాడా? లేక కోచింగ్ నుంచి తప్పుకుంటాడా? అన్నది త్వరలోనే తేలనుంది.
గంభీర్ కూడా ఫైర్..
నాలుగో టెస్ట్‌లో ఓటమి తర్వాత గంభీర్ కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు చేసింది చాలు ఇక నుంచి జట్టు వ్యూహాలకు అనుగుణంగా జాగ్రత్తగా ఆడకపోతే వేటు తప్పదనే హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గంభీర్ స్ట్రాటజీలకు, గ్రౌండ్‌లో ప్లేయర్ల ఆటకు అసలు పొంతనే కుదరడం లేదని వాదన కూడా వినిపిస్తోంది.
సీనియర్ల విషయంలోనూ కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. మరోవైపు టెస్ట్‌ల్లో టీమ్‌ను గట్టెక్కించేందుకు చతేశ్వర్ పుజారా సేవలు వినియోగించుకోవాలని గంభీర్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే దీనిని సెలెక్షన్ కమిటీ తిరస్కరించి నట్లుగా వార్తలు వస్తున్నాయి. పెర్త్ టెస్ట్ తర్వాత పుజారా అంశం తెరపైకి వచ్చినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.