ఆగస్ట్ 15న(మంగళవారం) దేశమంతటా మువ్వన్నెల జెండా రెపరెపలాడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు తమ డీపీని త్రివర్ణ పతాకంతో మార్చుకోవాలని భారత ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ విధంగా చేసి 'హర్ ఘర్ తిరంగ అభియాన్'లో భాగమవ్వాలని దేశ పౌరులందరినీ మోదీ కోరారు.
ఈ మాటలను స్ఫూర్తిగా తీసుకున్న బీసీసీఐ క్షణం ఆలస్యం చేయకుండా ట్విట్టర్(ఎక్స్) ఖాతా డీపీని మువ్వన్నెల పతాకంతో మార్చేసింది. ఇంకేముంది ఆ వెంటనే బీసీసీఐకి ఊహించని షాక్ తగిలింది. తన వెరిఫికేషన్ బ్లూటిక్‌ను కోల్పోయింది. అప్పటివరకు ఉన్న బ్లూటిక్ ఎందుకు పోయిందా? అని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
BCCI Loses Blue Tick Due to PM Narendra Modi's DP Change Request. pic.twitter.com/o0YFxMOmGT
— CricketGully (@thecricketgully) August 13, 2023
బ్లూటిక్ లేని బీసీసీఐ ఖాతాను చూసి నెటిజన్లు గందరగోళానికి లోనవుతున్నారు. వెస్టిండీస్‌తో ఐదో టీ20 ప్రారంభవ్వడానికి కొన్ని గంటల ముందు ఇది చోటుచేసుకుంది. ఎక్స్ సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా ఖాతా ప్రొఫైల్ డీపీ మారిన వెంటనే ఆ ఖాతా బ్లూటిక్ ఎగిరిపోతుంది. ఆపై సదరు ఖాతాను ఎక్స్ మేనేజ్‌మెంట్ రివ్యూ చేసి అన్ని మార్గదర్శకాలను అది పాటించినట్టు భావిస్తే అప్పుడు బ్లూ టిక్‌ను పునరుద్ధరిస్తుంది.