
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు జట్ల ప్రాక్టీస్ సెషన్లకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త ఆంక్షలు విధించింది. మునుపటి సీజన్‌ల మాదిరిగా ఇష్టమొచ్చినన్ని సార్లు ప్రాక్టీస్ సెషన్‌లు నిర్వహించే వెసులుబాటు లేదు. పరిమితులు విధించింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం, జట్లకు ఏడు ప్రాక్టీస్ సెషన్‌లకు మాత్రమే అనుమతినిచ్చింది. ప్రతి సెషన్ ఫ్లడ్‌లైట్ల కింద మూడు గంటల వరకు ఉంటుంది. వీటిలో రెండు సెషన్‌లను జట్టుకు నచ్చినట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేదా ఓపెన్ నెట్‌ల కోసం ఉపయోగించవచ్చు. అలాగే, లైట్ల కింద ఒక జట్టు ప్రాక్టీస్ గేమ్ ఆడితే, అది మూడున్నర గంటలకు మించకూడదని బీసీసీఐ నోట్‌లో పేర్కొంది. అంతేకాదు, ఈ మ్యాచ్‌లకు బీసీసీఐ నుండి ముందస్తు అనుమతి అవసరం.
కొత్త రూల్స్ ఇవే...
- ప్రతి జట్టుకు ఫ్లడ్ లైట్ల కింద మూడు గంటల చొప్పున ఏడు ప్రాక్టీస్ సెషన్‌లకు అనుమతి.
- వీటిలో రెండు జట్టుకు నచ్చినట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేదా ఓపెన్ నెట్‌లు.
- జట్టు లైట్ల కింద ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నట్లయితే, ఆ మ్యాచ్ వ్యవధి మూడున్నర గంటలకు మించకూడదు.
- ఒక జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలని అనుకుంటే, సైడ్ వికెట్లలో ఒకదానిపై ఆడుకోవాలి. దీనికి ముందుగా బీసీసీఐ అనుమతి అవసరం.
- రేంజ్ హిట్టింగ్ కోసం ప్రతి జట్టుకు 1 సైడ్ వికెట్ కేటాయిస్తారు.
- ఐపీఎల్ వేదికలలో స్థానిక మ్యాచ్‌లు, సెలబ్రిటీ టోర్నమెంట్‌లు లేదా లెజెండ్స్ లీగ్ ఆటలకు అనుమతి లేదు.
ఈ రూల్స్ లో అతి పెద్ద మార్పు.. మ్యాచ్ రోజుల్లో జట్లను ప్రాక్టీస్ చేయడానికి అనుమతించరు. దీనర్థం అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ సెషన్‌లను ముందుగానే పూర్తి చేసుకోవాలి. వారి మ్యాచ్‌ల రోజున వార్మప్‌లు లేదా ప్రాక్టీస్ కోసం స్టేడియం సౌకర్యాలను ఉపయోగించకూడదు.
ఆ వివాదానికి పరిష్కారం..
రెండు జట్లు ఒకేసారి ప్రాక్టీస్ చేయాలనుకుంటే BCCI ఒక పద్ధతిని ప్రతిపాదించింది. రెండు జట్ల నిర్వాహకుల మధ్య బోర్డు మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. ఒక సెషన్ ఒకరు.. మరొక సెషన్ ఒకరు అన్నట్లు సమయాన్ని పంచుకోవచ్చు. ఆ విషయంపై జట్లు ఏకాభిప్రాయానికి రాకపోతే, రెండు జట్ల అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని BCCI ప్రాక్టీస్ సమయాలను నిర్ణయిస్తుంది. రెండు జట్లకు సమానంగా రెండు గంటల స్లాట్‌లను సృష్టిస్తుంది.