దేశవాళీ టోర్నీల్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌ను వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేయకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. అతన్ని ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. సర్ఫరాజ్ ఫిట్‌నెస్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని, అతని మరింత ధృడంగా తయారు కావాలని తెలిపాడు. అలాగే అతని వ్యవహార శైలిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తోందని వెల్లడించాడు.
సెలక్టర్లు పిచ్చోళ్లు కాదు..
సర్ఫరాజ్ ఖాన్ ఆవేశాన్ని మేం అర్థం చేసుకోగలం. అతన్ని తీసుకోకపోవడానికి ఆట కాకుండా మరికొన్ని ఇతర కారణాలు ఉన్నాయి. గత మూడు సీజన్లుగా 900కు పైగా పరుగులు చేసిన ఆటగాడిని పరిగణనలోకి తీసుకోకపోవడానికి సెలెక్టర్లు ఏమైనా పిచ్చివాళ్లా(ఫూల్)?. అతడిని ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణం ఫిట్నెస్. అంతర్జాతీయ క్రికెట్‍కు తగ్గట్టుగా అతని ఫిట్‍నెస్ లెవెల్స్ లేవు. ఫిట్‍నెస్ మెరుగు పర్చుకునేందుకు అతడు మరింత కష్టపడాలి. ధృడంగా తయారవ్వాలి.జట్టుకు ఎంపిక చేయాలంటే పరుగులు మాత్రమే అర్హత కాదు. ఆటగాడి ఫిట్‍నెస్‍ను కూడా పరిగణనలోకి తీసుకుంటారు..' అని సదరు బీసీసీఐ అధికారి తెలిపాడు.
క్రమశిక్షణ ముఖ్యం
సర్ఫరాజ్ ప్రవర్తనా శైలి కూడా విరుద్ధంగా ఉంటోంది. సెంచరీ చేశాక బిగ్గరగా అరవడాలు, తొడ కొట్టడాలు ఎందుకు? ఒకరిని విమర్శించేలా సంజ్ఞలు చేయడం కూడా సరికాదు. ఆటగాళ్లకు క్రమశిక్షణ ముఖ్యం. అతడిలో అది ఏమాత్రం కనిపించడం లేదు. సర్ఫరాజ్ ను ఇగ్నోర్ చేయడానికి ఇది కూడా ఒక కారణమే. ఇలా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకునే జట్టుకు ఎంపిక చేస్తాం.." అని సదరు అధికారి విమర్శలకు సమాధానమిచ్చాడు.
గత మూడు రంజీ ట్రోఫీ సీజన్లలో సర్ఫరాజ్ ఖాన్
- 2019/20: 928
- 2022-23: 982
- 2022-23: 656
సర్ఫరాజ్ ఏం చేశాడంటే..?
బీసీసీఐ అధికారి చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదు. సర్ఫరాజ్ కాస్త మితి మీరి ప్రవర్తిస్తుంటాడు. ఈ ఏడాది ఢిల్లీతో జరిగిన రంజీ మ్యాచులో సర్ఫరాజ్ సెంచరీ చేయగానే.. ఆవేశంగా తొడ కొడుతూ చేతి పైకెత్తి 'బాగా చూడు.. ఇది నా ఆట' అన్నట్టుగా డగౌట్ వైపు చూపిస్తూ సంజ్ఞలు చేశాడు. అక్కడ బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ ఉన్నాడు. ఇది బీసీసీఐకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ తరువాత బంగ్లాదేశ్ టూర్ కు అతన్ని ఎంపిక చేయలేదు. దీంతో అతడు మరోసారి సెలక్టర్లను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇలా అతని వ్యవహార శైలి కూడా అతన్ని ఎంపికచేయకపోవడానికి కారణమవుతోంది.