తెలంగాణలోని అన్ని జిల్లాల్లో క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రోత్సహించాలి

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రోత్సహించాలి

న్యూఢిల్లీ: హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏ)లో నిధుల దుర్వినియోగంతో పాటు అనేక అంశాల్లో నిబంధనల ఉల్లంఘనలపై బీసీసీఐ అంబుడ్స్‌‌మన్‌‌ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో క్రికెట్‌‌ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు హెచ్‌‌సీఏ చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్లేయర్లు హైదరాబాద్‌‌కు రాకుండా అన్ని జిల్లాలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలిపింది. హెచ్‌‌సీఏ సభ్యత్వంలో ఉన్న అసమానతలపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. 2018 నుంచి 2021 వరకు ఇచ్చిన ఆదేశాలను హెచ్‌‌సీఏ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. కరీంనగర్‌‌ జిల్లా క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ ప్రెసిడెంట్‌‌ వెలిచాల ఆగం రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీసీసీఐ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 

31 జిల్లాల నుంచి సభ్యులుండాలి..

తెలంగాణ జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే 9 మంది సభ్యులు మాత్రమే కాకుండా 31 జిల్లాల నుంచి కనీసం ఒకర్ని ఓటింగ్‌‌ సభ్యుడిగా చేర్చాలని అంబుడ్స్‌‌మన్‌‌ తెలిపింది. ‘ఈ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి 6 నెలల్లోపు హైదరాబాద్‌‌ వెలుపల క్రికెట్ అభివృద్ధికి తీసుకున్న చర్యల నివేదికను రూపొందించి బీసీసీఐకి అందజేయాలి. అదే నివేదికను హెచ్‌‌సీఏ వెబ్‌‌సైట్‌‌లోనూ ఉంచాలి. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల్లో 25 శాతం జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఖర్చు చేయాలి. ఇందుకోసం ఏజీఎమ్‌‌ నిర్వహించాలి. జిల్లా క్రికెట్‌‌ సంఘాలకు సొంత ప్రత్యేక అధికార పరిధి ఉంటుంది. వివిధ ఏజ్‌‌ గ్రూప్‌‌ల్లో వందలాది మంచి ప్లేయర్లు, ప్రత్యేక టీమ్‌‌లు ఉన్నాయి. 

హెచ్‌‌సీఏ ప్రాధాన్యతలు, విధానాల వల్ల జిల్లాల్లోని ప్లేయర్లు తమ క్రికెట్‌‌ ఆకాంక్షను నెరవేర్చుకోలేకపోతున్నారు. దీనికోసం నగరంలోని ప్రైవేట్ కోచింగ్‌‌ కేంద్రాలు, క్లబ్‌‌ల్లో చేరాల్సి వస్తుంది. దీనివల్ల జిల్లా క్రికెట్ సంఘాల కార్యకలాపాలు, క్రికెట్ అభివృద్ధి తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రొఫెషనల్‌‌ కోచింగ్‌‌, టోర్నీలతో కూడిన గ్రౌండ్స్‌‌ లేకపోవడం వల్ల జిల్లాల నుంచి వచ్చే ప్లేయర్లు హెచ్‌‌సీఏ రాష్ట్ర జట్టులోకి ప్రవేశించలేకపోతున్నారు. మెన్స్‌‌, విమెన్స్‌‌ ప్లేయర్లలో టాలెంట్‌‌ ఉన్నప్పటికి ఖర్చులను భరించలేక వెనకడుగు వేస్తున్నారు. హెచ్‌‌సీఏ లీగ్‌‌ల్లో ప్రవేశం కోసం ప్రైవేట్‌‌ క్లబ్‌‌ల్లో మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్‌‌కు వెళ్తున్నారు. దీనిని అరికట్టేందుకు హెచ్‌‌సీఏ అన్ని చర్యలు తీసుకోవాలి’ అని బీసీసీఐ పేర్కొంది.