అమృత్‌సర్/లాహోర్: దాదాపు 17 ఏండ్ల గ్యాప్ తర్వాత బీసీసీఐకి చెందిన అధికారులు తొలిసారి పాకిస్తాన్‌లో అడుగు పెట్టారు. ఆసియాకప్‌నకు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సోమవారం లాహోర్ గవర్నర్ హౌజ్‌లో నిర్వహించిన అధికారిక విందుకు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా హాజరయ్యారు. ఇందుకోసం ఈ ఇద్దరూ అట్టారి–వాఘా బోర్డర్ మీదుగా ప్రయాణించారు. ఆసియా కప్‌లో పాల్గొంటున్న అన్ని దేశాల క్రికెట్ బోర్డుల ప్రతినిధులు, పాక్, శ్రీలంక, అఫ్గాన్ క్రికెటర్లు విందులో పాల్గొన్నారు.
కాగా, తమ ఆహ్వానాన్ని బీసీసీఐ అంగీకరించడం ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలు మెరుగయ్యేందుకు ముందడుగు అని పీసీబీ చీఫ్ జకా అష్రఫ్ అభిప్రాయపడ్డారు. క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టకూడదని కాంగ్రెస్ ఎంపీ కూడా అయిన రాజీవ్ శుక్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు వాఘా బోర్డర్ వద్ద బిన్నీ, శుక్లాను అష్రఫ్ రిసీవ్ చేసుకున్నారు. ఈ ఇద్దరూ మంగళ, బుధవారాల్లో గడాఫీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లకు హాజరు కానున్నారు.
కాగా, శ్రీలంకలో వర్షం కారణంగా ఆసియా కప్ మ్యాచ్‌లకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో పీసీబీ చీఫ్ అష్రఫ్ ఆదివారం బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ అయిన జై షాతో ఫోన్లో మాట్లాడారు. ఇండియా ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌కు షిఫ్ట్ చేయాలని రిక్వెస్ట్ చేయగా.. షా సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. కొలంబో మ్యాచ్‌లను దంబుల్లా లేదా హంబంటోటాకు షిఫ్ట్ చేయాలని ఏసీసీ ఇప్పటికే భావిస్తోంది.