క్రికెటర్ నైతికతను దెబ్బ తీసేందుకే ఇలాంటి కామెంట్స్: షామా మొహమ్మద్‌పై బీసీసీఐ విమర్శలు

క్రికెటర్ నైతికతను దెబ్బ తీసేందుకే ఇలాంటి కామెంట్స్: షామా మొహమ్మద్‌పై బీసీసీఐ విమర్శలు

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ షామా మొహమ్మద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా షామా మొహమ్మద్ చేసిన వ్యాఖ్యలను 'దురదృష్టకరం' అని చెప్పారు. ఐసీసీ ఈవెంట్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఒక క్రికెటర్ నైతికతను దెబ్బతీస్తుందని సైకియా అన్నారు.

సైకియా మాట్లాడుతూ.. "జట్టు కీలకమైన ఐసీసీ టోర్నమెంట్ మధ్యలో ఉన్నప్పుడు బాధ్యతరహితమైన వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తితో పాటు జట్టుపై నిరాశపరిచే ప్రభావాన్ని చూపవచ్చు. ఆటగాళ్లు అందరూ తమ అత్యున్నత ప్రదర్శన ఇస్తున్నారు. మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత ప్రచారం కోసం వ్యక్తులు ఇలాంటి అవమానకరమైన ప్రకటనలు చేయడం మానేస్తారని నేను ఆశిస్తున్నాను" అని బీసీసీఐ కార్యదర్శి సైకియా అన్నారు.

అసలేం జరిగిందంటే..?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అధిక బరువుతో ఉన్నారు.. బరువు తగ్గాల్సి ఉంది.. టీమిండియాలో ఇప్పటి వరకు ఉన్న అందరి కెప్టెన్లలో.. ఆకట్టుకోని విధంగా ఉన్నది ఒక్క రోహిత్ శర్మనే అంటూ తన అకౌంట్ నుంచి పోస్టులు పెట్టారు మాజీ జర్నలిస్ట్, కాంగ్రెస్ మహిళా నేత షామీ మొహమ్మద్. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ లో రోహిత్ శర్మ 17 బంతుల్లో 15 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్ ను టీమిండియా 44 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత షామీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. 

Also Read :- ఆస్ట్రేలియా మాత్రమే ఇండియాను ఓడించగలదు

37 ఏళ్ల రోహిత్ శర్మ కెప్టెన్సీపైనే కాదు.. అతని బాడీ షేమింగ్.. లావుగా ఉండటంపై గతంలోనూ సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వచ్చాయి. ఈసారి కాంగ్రెస్ మహిళా నేత ఈ కామెంట్స్ చేయటంతో ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పార్టీ మధ్య మాటల యుద్ధంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపోటములపై రోహిత్ శర్మ కెరీర్ ఆధారపడి ఉందనేది ఎక్కువగా వినిపిస్తున్న మాట..