BCCI Central Contracts: మూడు ఫార్మాట్‌లు ఆడకున్నా A+ కాంట్రాక్ట్ .. కారణమేంటో చెప్పిన బీసీసీఐ!

BCCI Central Contracts: మూడు ఫార్మాట్‌లు ఆడకున్నా A+ కాంట్రాక్ట్ .. కారణమేంటో చెప్పిన బీసీసీఐ!

సోమవారం (ఏప్రిల్ 21) బీసీసీఐ 2024-25 సీజన్కు గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ ను అధికారికంగా ప్రకటించింది. ఈ కాంట్రాక్ట్ జాబితాలో మొత్తం 34 మంది ఆటగాళ్లను నాలుగు వేర్వేరు గ్రేడ్‌లుగా విభజించారు. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ , జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. గ్రేడ్ A+ కేటగిరిని నిలుపుకున్నారు. సెంట్రల్ కాంట్రాక్ట్ రూల్స్ ప్రకారం ఒక ఆటగాడు  గ్రేడ్ A+ కేటగిరికి అర్హత సాధించి ఉండాలంటే మూడు ఫార్మాట్ లలో రెగ్యులర్ సభ్యుడై ఉండాలి.  వీరిలో ప్రస్తుతం బుమ్రా ఒక్కడే మూడు ఫార్మాట్ లు ఆడుతున్నాడు.

మరోవైపు విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ముగ్గురు రానున్న సీజన్ లో రెండు ఫార్మాట్ లు మాత్రమే ఆడనున్నారు. రెండు ఫార్మాట్ లే ఆడుతున్నప్పటికీ ఈ ముగ్గురికి సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ లో ఏ + కేటగిరి ఎలా ఇస్తారనే సందేహం మొదలైంది. ఈ ప్రశ్నకు బీసీసీఐ అధికారి క్లారిటీ ఇచ్చారు. కోహ్లీ, రోహిత్, జడేజా గ్రేడ్ A+ కేటగిరికి ఎందుకు అర్హులో వివరించారు. 

"సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధి అక్టోబర్ 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు ఉంటుంది. కానీ అసెస్‌మెంట్ సంవత్సరం అక్టోబర్ 1, 2023 నుండి సెప్టెంబర్ 30, 2024 వరకు ఉంటుంది. కోహ్లీ, రోహిత్, జడేజా జూన్ 2024లో టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఆడారు. ఆ సమయంలో వారు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్‌ ప్లేయర్లుగా భారత జట్టులో కొనసాగారు. దీని ప్రకారం వారు  A+ కేటగిరీలో ఉండాలి. అదే విధంగా ఇషాన్..రెండు వరల్డ్ కప్ మ్యాచ్ లు.. శ్రేయాస్ 2023-24 సీజన్‌లో 15 వన్డేలు, కొన్ని టెస్టులు ఆడారు. అందువల్ల వారి వారి కేటగిరీలను పొందారు" అని బీసీసీఐ అధికారి తెలిపారు. 

►ALSO READ | MS Dhoni: నేనలా చేయలేదు.. ఆ పుకారు వింటే ఇప్పటికీ నవ్వొస్తుంది: ధోనీ

సెంట్రల్ కాంట్రాక్ట్ గత సంవత్సరంలో ఎలాంటి ప్రదర్శన చేశారనే దానిపై ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం 2023 అక్టోబర్ 1 నుండి 2024 సెప్టెంబర్ 30 వరకు ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటారు. కోహ్లీ, రోహిత్, జడేజా టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వీరు గత ఏడాది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడారు. 2023-24 సీజన్ లో వారు అన్ని ఫార్మాట్ లు ఆడుతూ జట్టులో కీలక ప్లేయర్లుగా ఉన్నారు. దీని ప్రకారం వారు  A+ కేటగిరీ లభించింది. 

ఈ సారి సెంట్రల్ కాంట్రాక్ట్ లో మొదటి సారి ఐదుగురు ఆటగాళ్లకు చోటు కల్పించిన బీసీసీఐ.. మరో ఐదుగురు క్రికెటర్లను ఈ లిస్ట్ నుంచి తొలగించింది. రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ , జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. గ్రేడ్ A+ కేటగిరిని నిలుపుకోగా..రిషబ్ పంత్ గ్రేడ్ బి నుంచి గ్రేడ్ ఏ కు ప్రమోట్ అయ్యాడు. గత ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి శ్రేయాస్ అయ్యర్, కిషాన్ లకు సెంట్రల్ కాంట్రాక్ట్ లో బీసీసీఐ చోటు కల్పించింది. 

గ్రేడ్ ‘బీ’ లో శ్రేయాస్ అయ్యర్, గ్రేడ్ ‘సీ’ లో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నారు. ఇక.. గ్రేడ్ ‘ఏ’కు మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్, హార్థిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రిషబ్ పంత్ ఎంపిక కావడం గమనార్హం. ‘గ్రేడ్’ సీలో టీమిండియా యువ ఆటగాళ్లకు అవకాశం దక్కింది.

ఇక.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుకు ఎంపికైన క్రికెటర్ల వార్షిత వేతనం విషయానికొస్తే.. ‘A+’ గ్రేడ్ క్రికెటర్లకు రూ.7 కోట్ల శాలరీ, గ్రేడ్ ‘A’ కు ఎంపికైన క్రికెటర్లకు 5 కోట్లు, గ్రేడ్ ‘B’ కి ఎంపికైన క్రికెటర్లకు 3 కోట్లు, గ్రేడ్ ‘C’ కి ఎంపికైన క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం అందుతుంది. కాంట్రాక్టుకు అర్హత సాధించాలంటే ఒక సంవత్సరంలో కనీసం మూడు టెస్ట్ మ్యాచులు, 8 వన్డేలు, 10 టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంటుంది.