టీ20 వరల్డ్ కప్ ఓటమితో తీవ్ర అసంతృప్తితో ఉన్న బీసీసీఐ..ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్పై దృష్టి పెట్టింది. స్వదేశంలో జరిగే ఈ మెగాటోర్నీలో టీమిండియా విజేతగా నిలిపేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించింది. ఇందులోభాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన, అనుభవం కలిగిన క్రికెటర్లనే జాతీయ జట్టుకు సెలక్ట్ చేయాలని సెలక్టర్లను ఆదేశించింది. అలాగే క్రికెటర్లు గాయపడితే..తిరిగి జట్టులోకి ఎంపిక చేయాలంటే వారికి యోయో టెస్టుతో పాటు డెక్సా టెస్టు నిర్వహించాలని, అందులో నెగ్గితేనే జట్టులోకి సెలక్ట్ చేస్తారని వెల్లడించింది. క్రికెటర్లపై ఒత్తిడిని తగ్గించేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలతో కలిసి పనిచేయాలని జాతీయ క్రికెట్ అకాడమీకి సూచించింది. అటు 20 మంది ఆటగాళ్లతో కూడిన కోర్ టీమ్ ను సిద్థం చేయనుంది.
2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అనంతరం ఒక్క మెగా టోర్నీలోనూ భారత జట్టు గెలవలేదు. 2022లో జరిగిన ఆసియాకప్, టీ20 వరల్డ్ కప్ లోనూ భారత్ ప్రదర్శన అంతగా బాగాలేదు. అనంతరం బంగ్లాదేశ్ పై వన్డే సిరీస్ ను కోల్పోయింది. దీంతో టీమిండియా పర్ఫామెన్స్ పై రివ్యూ చేయాలని భావించిన బీసీసీఐ జనవరి 1న మీటింగ్ నిర్వహించింది. ఈ సమీక్ష సమావేశంలో బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జే షా, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, ఎన్‌సీఏ అధినేత వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ పాల్గొన్నారు. అయితే 2023 వరల్డ్ కప్ కు 20 మంది ఆటగాళ్లను బీసీసీఐ షార్ట్‌లిస్ట్ చేసిందని తెలుస్తోంది. వరల్డ్ కప్ కు ఆటగాళ్లు రెడీగా తీర్చిదిద్దేందుకు 20 మందిని షార్ట్ లిస్ట్ చేసిందని తెలుస్తోంది.