ప్రతిష్టాత్మకమైన బీసీసీఐ అవార్డ్స్ కార్యక్రమం నేడు (జనవరి 23) హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగబోతుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుండగా.. కొద్దిసేపటి కిందట శంషాబాద్ విమానాశ్రమానికి బీసీసీఐ కార్యదర్శి జైషా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చేరుకున్నారు. వీరికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్‌రావు స్వాగతం పలికారు.
భాగ్య నగరానికి బీసీసీఐ పెద్దలు హాజరుకావడంతో హైదరాబాద్ క్రికెట్ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జైషా, రాజీవ్ శుక్లా ఎయిర్ పోర్ట్ దగ్గర దిగిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. కరోనా కారణంగా ఈ వేడుక గత మూడు సంవత్సరాలుగా జరగలేదు. బీసీసీఐ అవార్డుల కార్యక్రమం చివరిసారిగా 2020 జనవరిలో ముంబై వేదికగా జరిగింది. 2018-19 క్రికెట్ ఏడాదికి అత్యుత్తమ ఆటగాళ్లకు అవార్డులు ఇచ్చింది. పురుషుల జట్టులో జస్‌ప్రీత్ బూమ్రా, మహిళల జట్టులో పూనమ్ యాదవ్‌లకు అవార్డు దక్కింది.
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు హైదరాబాద్ లోనే ఉంది. ఇంగ్లండ్ తో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ ఈ నెల 25 న జరుగనుంది. మరోవైపు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ జట్టుని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్.. బీసీసీఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్–2023 అవార్డుకు ఎంపికయ్యాడు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరిగే వార్షిక అవార్డుల కార్యక్రమంలో గిల్‌కు బోర్డు ఈ పురస్కారాన్ని అందజేయనుంది. గత 12 నెలల్లో అద్భుత పెర్ఫామెన్స్ చేసిన గిల్ వన్డేల్లో వేగంగా 2 వేల రన్స్ మార్క్‌ను అందుకున్నాడు. ఇందులో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి.
మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు అందుకోనున్నాడు. 61 ఏళ్ల శాస్త్రి తన కెరీర్‌లో 80 టెస్ట్‌లు, 150 వన్డేలు ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత రెండు పర్యాయాలు టీమిండియాకు చీఫ్ కోచ్‌గా వ్యవహరించాడు.