ఇంగ్లాండ్ తో త్వరలో జరగబోయే వన్డే సిరీస్ కు కేఎల్ రాహుల్ ను ఎంపిక చేసే ఉద్దేశ్యంలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీకి ముందు ఈ సిరీస్ జరగనుండడంతో రాహుల్ ను ఆడించే ప్రయత్నాలు చేస్తోందట. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు ముందుగా రాహుల్ బీసీసీఐ నుంచి విరామం కోరినట్లు కోరగా, దానికి బోర్డు కూడా అంగీకరించింది. అయితే తాజాగా బీసీసీఐ రాహుల్ విషయంలో మనసు మార్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
తాజా రిపోర్ట్స్ ప్రకారం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రాహుల్ ను ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండమని కోరింది. వన్డేల్లో భారత్ కు రాహుల్ ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రాహుల్ పై పని భారం తగ్గించాలని మొదట్లో బీసీసీఐ భావించినా.. ఈ మెగా టోర్నీకి ముందు ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ మాత్రమే ఉండడంతో ఈ సిరీస్ ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుందని భావించిందట. జనవరి 12 న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్లను ప్రకటించాల్సిందని కోరినా బీసీసీఐ మరింత సమయం తీసుకోనుందని టాక్.
ఇటీవలే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై రాహుల్ 5 టెస్ట్ మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో రాణించాడు. ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా రాహుల్ పర్వాలేదనిపించాడు. 9 ఇన్నింగ్స్‌లలో 30.66 సగటుతో 276 పరుగులు చేసి భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. రాహుల్ కు బ్యాకప్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ఎంపికయే అవకాశం ఉంది. సంజు శాంసన్ రూపంలో పంత్ కు గట్టి పోటీ ఎదురు కావచ్చు.