Team India: పెళ్లాం, పిల్లలతో ఎంజాయ్ చేస్తామంటే కుదరదు.. భారత క్రికెటర్లపై బీసీసీఐ ఆంక్షలు

ఏదైనా విదేశీ టూర్ అనగానే.. భారత క్రికెటర్లు పెళ్లాం, పిల్లలతో వాలిపోతారన్న విషయం తెలిసిందే. గెలుపోటములు పక్కనపెట్టి.. ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి ఆయా నగర వీధుల్లో ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సమయంలోనే అటువంటి సన్నివేశాలే కనిపించాయి. 

వరుసగా టెస్టుల్లో ఓడుతున్నా.. పరుగులు చేయడంలో విఫలమవుతున్నా భారత క్రికెటర్లలో ఎటువంటి నిరుత్సాహం కనిపించలేదు. ఆహ్ పోతే పోయిందిలే అన్నట్టు పెళ్లాం, పిల్లలతో కలిసి సిడ్నీ, బ్రిస్బేన్ నగర వీధుల్లో ఎంజాయ్ చేశారు. ఇటువంటి వాటిపై పదే పదే విమర్శలు వస్తుండటంతో బీసీసీఐ అప్రమత్తం అయ్యింది. మున్ముందు అటువంటి వాటికి తావు లేకుండా పరిమితులు విధించింది.

బీసీసీఐ సూచించిన నియమాలు

  • టోర్నమెంట్‌ అంతటా భార్యలు ఆటగాళ్లతో కలిసి ఉండలేరు.
  • ఏదేని టోర్నీ 45 లేదా అంతకంటే ఎక్కువ రోజుల అయితే.. కుటుంబం 14 రోజులు మాత్రమే ఆటగాళ్లతో ఉండటానికి అనుమతి.
  • ఒకవేళ టోర్నీ అంతకంటే తక్కువగా ఉంటే.. 7 రోజులకు మాత్రమే అనుమతి. 
  • ఆటగాళ్లందరూ టీమ్ బస్సులో ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రత్యేక ప్రయాణం అనుమతించబడదు
  • ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యక్తిగత మేనేజర్‌ని టీమ్ బస్సులో లేదా వీఐపీ బాక్స్‌లోకి అనుమతించరు. అతను వేరే హోటల్‌లో బస చేయాల్సి ఉంటుంది.
  • ఆటగాళ్ల లగేజీ 150 కిలోల కంటే ఎక్కువ ఉంటే బీసీసీఐ అదనపు లగేజీ ఛార్జీలు చెల్లించదు. అదనపు లగేజీ ఛార్జీలు ఆటగాడు భరించాల్సి ఉంటుంది.

నెలన్నర రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ..

ఆస్ట్రేలియా సిరీస్ ముగిసిన అనంతరం బీసీసీఐ ఇటీవల రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నష్ట నివారణ చర్యలు చేపట్టాలని బీసీసీఐ నిర్ణయించిందట. ఆటగాళ్లు ప్రాక్టీస్ కంటే.. కుటుంబానికే అధిక సమయం వెచ్చిస్తున్నందునే ఈ పరిమితులు విధించినట్లు తెలుస్తోంది. అందునా మరో ఆరు వారాల వ్యవధిలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. మరోసారి అటువంటి విమర్శలకు తావివ్వకూడదని బీసీసీఐ నిర్ణయించినట్టు సమాచారం.