హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్‌అసోసియేషన్ (టీడీసీఏ) తెలిపింది. పేద క్రికెటర్లు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించాలంటే తమ సంఘానికి బీసీసీఐ గుర్తింపు ఇవ్వాలని టీడీసీఏ ప్రెసిడెంట్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కోరారు.
శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో టీడీసీఏ 2025 క్యాలెండర్, అండర్–-16 టోర్నమెంట్ ట్రోఫీలను యూఎస్‌ఏ క్రికెట్ బోర్డు చైర్మన్ పిసికే వేణు రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్జ్) చైర్మన్ శివసేనా రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేణు రెడ్డిని టీడీసీఏ ఘనంగా సత్కరించింది. తెలంగాణ బిడ్డ అయిన వేణు రెడ్డి యూఎస్‌ఏ క్రికెట్ బోర్డుకు చైర్మన్ అవ్వడం రాష్ట్రానికి గర్వకారణమని శివసేనా రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ది కోసం కష్టపడుతున్న టీడీసీఏకు శాట్జ్, ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో గ్రామీణ క్రికెట్ అభివృద్ధి చెందాలని వేణు రెడ్డి ఆకాంక్షించారు.