Ranji Trophy: ఔటైనా గ్రౌండ్‌లోనే ఉన్నాడు.. మహారాష్ట్ర సీనియర్ క్రికెటర్‌పై మ్యాచ్ నిషేధం

Ranji Trophy: ఔటైనా గ్రౌండ్‌లోనే ఉన్నాడు.. మహారాష్ట్ర సీనియర్ క్రికెటర్‌పై మ్యాచ్ నిషేధం

మహారాష్ట్ర స్టార్ బ్యాటర్ అంకిత్ బావ్నేకి బీసీసీఐ షాక్ ఇచ్చింది. అతన్ని రంజీ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఆడకుండా నిషేధానికి గురి చేసింది. గురువారం (ఫిబ్రవరి 23) నాసిక్ వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో అంకిత్ బరిలోకి దిగలేదు. 2024 రంజీ ట్రోఫీలో భాగంగా  సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో బావ్నే ఔటైనప్పటికీ గ్రౌండ్ నుంచి వెళ్లేందుకు నిరాకరించాడు. ఈ మ్యాచ్ లో అంపైర్ ఔట్ నిర్ణయాన్ని తిరస్కరించినందుకు  సస్పెన్షన్ విధించబడింది.

అసలేం జరిగిందంటే:

రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించిన బావ్నే.. 73 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్లిప్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సర్వీసెస్ స్పిన్నర్ అమిత్ శుక్లా బౌలింగ్ లో శుభమ్ రోహిల్లా అందుకున్న క్యాచ్ బౌన్స్ అయ్యింది. ఇది గమనించిన అంకిత్ బావ్నే గ్రౌండ్ వెళ్లేందుకు నిరాకరించి అక్కడే ఉన్నాడు. దీంతో ఆట 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. రీప్లే చూపించకపోవడం.. రివ్యూ తీసుకునే అవకాశం లేకపోవడంతో అతను మైదానాన్ని వీడక తప్పలేదు. 

ALSO READ | Ranji Trophy: రోహిత్ సైన్యాన్ని వణికించిన పుల్వామా పేసర్.. ఎవరీ ఉమర్ నజీర్ మీర్..?

32 ఏళ్ల మిడిల్ ఈ ఆర్డర్ బ్యాటర్ 2007లో మహారాష్ట్ర తరఫున అరంగేట్రం చేసి ఇప్పటివరకు 122 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 51 సగటుతో మొత్తం 8,241 పరుగులు చేశాడు. వీటిలో 24 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 258 నాటౌట్. నేడు జరుగుతున్న మ్యాచ్ లో అంకిత్ బావ్నే లేని లోటు మహారాష్ట్ర జట్టులో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.