
- రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
బషీర్బాగ్, వెలుగు: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఇదే డిమాండ్ తో వచ్చే నెల 12, 13వ తేదీల్లో తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని సక్సెస్చేయాలని పిలుపునిచ్చారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం, దక్షిణాది రాష్ట్రాల ఓబీసీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మారేశ్, దక్షిణాది రాష్ట్రాల ఓబీసీ సంఘం అధ్యక్షుడు జబ్బల శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాగర్ తో కలసి ఆర్.కృష్ణయ్య చలో ఢిల్లీ పోస్టర్ ను ఆవిష్కరించారు.
స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు దాటుతున్నా ఓబీసీలకు రాజకీయ స్వాతంత్ర్యం రాలేదన్నారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. దేశ వ్యాప్తంగా కులగణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఓబీసీల సమస్యలపై స్పందించాలన్నారు. సమావేశంలో రాజేందర్, పీతాను ప్రసాద్, శ్రీనివాస్ రావు, నీలం వెంకటేశ్, రాజశేఖర్, అనంతయ్య, చల్లా వరుణ్, లక్ష్మణరావుతోపాటు దాదాపు 40 పైగా కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.