బీసీలు ఎప్పటికీ వెనుకబడే ఉండాల్నా?

టీఆర్​ఎస్​ సర్కారుకు బీసీల ఓట్లపై ఉన్న ప్రేమ వారి అభివృద్ధిపై ఏమాత్రం లేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ ఆరేండ్ల ఆరు నెలల్లో బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక, అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. కొత్త స్కీములు పెట్టడం లేదు. ఉన్న స్కీములను సక్రమంగా అమలు చేయడం లేదు. అడుగడుగునా బీసీ కులాలను అణచివేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. బీసీలను అణచివేయడానికి రిజర్వేషన్లు తగ్గించడం, కోటాను సక్రమంగా అమలు చేయకపోవడం, స్టూడెంట్లు చదువుకోవడానికి ఫీజులు చెల్లించకపోవడం, ఉద్యోగాల భర్తీ చేయకపోవడం, బీసీల బడ్జెట్ తగ్గించడం లాంటి చర్యలే దీనికి సంకేతం. ఉద్దేశపూర్వకంగానే బీసీ కులాలను అణచివేస్తున్నారనే ప్రభుత్వ చర్యలు చూస్తే అర్థమవుతోంది.

పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డ్ మెంబర్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. 74 ఏండ్లలో బీసీ, ఎస్టీ, ఎస్సీ కులాల వారు ఓట్లు వేసి అగ్ర కులాల వారిని 32 మందిని ముఖ్యమంత్రులను చేశారు. వేలాది మందిని ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులను చేశాం. కానీ, బీసీలు సర్పంచులైతే కూడా ఈ అగ్రకుల నాయకులు ఓర్వలేరా! బీసీ కులాల జనాభా 54 శాతం ఉంటే రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించడంలో ఏమైనా న్యాయం ఉందా? మొత్తం 12,751 గ్రామ పంచాయతీల్లో 56 శాతం జనాభా గల బీసీలకు 6,822 పంచాయతీలు బీసీలకు దక్కాలి. గతంలో మాదిరిగా 34 శాతం కోటా అమలు చేసినా 4,300 దక్కాలి. కానీ, 2,332 కేటాయించారు. అంటే 18 శాతమే. రిజర్వేషన్లు తగ్గించడం వల్ల 2 వేల సర్పంచులు, 23 వేల వార్డు మెంబర్ల పోస్టులు బీసీలకు దక్కకుండా పోయాయి. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జెడ్పీ, ఎంపీపీ చైర్మన్ రిజర్వేషన్లను కూడా 22 శాతానికి తగ్గించేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత, టీఆర్​ఎస్​ అధికారంలోకి రాకముందు పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచుతామని గ్రామగ్రామాల్లో గోడల మీద రాసిన రాతలు ఇంకా ఉన్నాయి.

కాంట్రాక్టర్లే ముఖ్యమా?

బీసీ కులాలకు ఒక్కొక్కరికీ రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు సబ్సిడీ రుణాలిస్తామని మూడేండ్ల కింద బీసీ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షలకుపైగా అప్లికేషన్లు తీసుకున్నారు. వారిలో ఆశలు కల్పించారు. కానీ ఎన్నికలు ముగియగానే వాటిని చెత్తబుట్టలో పడేశారు. పెద్ద  కాంట్రాక్టర్లైన మెగా కృష్ణారెడ్డి, నవయుగకు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద రూ.90 వేల కోట్లు, మిషన్ భగీరథ పేరు మీద రూ.50 వేల కోట్లు ఇచ్చారు. ఇందులో 10 శాతం బడ్జెట్ ఇచ్చినా మొత్తం బీసీ కులాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల సబ్సిడీ రుణాలు వస్తాయి. బీసీలకంటే రాష్ట్రాన్ని దోచుకుంటున్న మెగా కృష్ణారెడ్డి, ఇతర కాంట్రాక్టర్లు ముఖ్యమా? మరోవైపు పక్కరాష్ట్రాలైన కర్నాటక, ఆంధ్రప్రదేశ్​తోపాటు గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కరోనా కష్టకాలంలో బీసీ కుల వృత్తులు చేసే వారి కుటుంబాలకు నెలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఈ ప్రభుత్వానికి మాత్రం వారికి సాయం చేసేందుకు మనసు రాలేదు. ఇక రాష్ట్రంలో ఉన్న నాయీ బ్రాహ్మణ, రజక, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి–శాలివాహన, వాల్మీకి, వడ్డెర, మేదర, పూసల, బట్రాజు మొదలైన 14 ఫెడరేషన్లకు ఆరేండ్లుగా బడ్జెట్ ఇవ్వడం లేదు. పాలక మండళ్లు, చైర్మన్, డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఈ కులాల్లో నాయకత్వం ఎదగకుండా కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్​లో ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ చొపున 56 కార్పొరేషన్లు పెట్టి, పాలక మండళ్లు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి లక్షల రూపాయలు ‘ఫ్రీ’గా ఇస్తున్నారు. మన రాష్ట్రంలో ముదిరాజ్​, గొల్ల, కురుమలు, మున్నూరు కాపు, గౌడ, పద్మశాలి, బలిజలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని బీసీ సంఘలు సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి  చేసినా పట్టించుకోవడం లేదు.

బీసీల బడ్జెట్​ను తగ్గించింది

జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా కేంద్రం వందల కోట్ల రూపాయలు అన్ని రాష్ట్రాలకు ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో ఈ బడ్జెట్ మనకు రావడం లేదు. ఈ రుణాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి అడ్డుతగులుతోంది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో బీసీల బడ్జెట్.. మొత్తం బడ్జెట్​లో 3.6 శాతం ఉండగా.. టీఆర్ఎస్​ అధికారంలోకి రాగానే దానిని 1.8 శాతానికి  తగ్గించారు. బీసీలు ఈ అగ్రకుల ప్రభుత్వానికి కన్పించడం లేదా! లేక వారిని అభివృద్ధి చేయడం ఇష్టం లేదా? 2017 డిసెంబర్ లో  బీసీల అభివృద్ధికి ఏం చేయాలి.. ఎలాంటి స్కీములు పెట్టాలనే దానిపై చర్చించడానికి బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సీఎం కేసీఆర్​ ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి సంబంధించి 210 తీర్మానాలు చేశారు. ఈ డిమాండ్లను పరిష్కరిస్తానని సీఎం ఆర్భాటంగా ప్రకటించినా.. ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఇది పచ్చి బీసీ వ్యతిరేక చర్య కాదా?

ఇంటికో ఉద్యోగం ఏమైంది

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తే 95 శాతం పోస్టులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పోతాయనే నియామకాలు చేపట్టడం లేదు. తెలంగాణ వస్తే ‘ఇంటికొక’ ఉద్యోగం ఇస్తామన్నారు. కానీ, ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. అన్ని వర్గాలకు  పారిశ్రామిక పాలసీ ప్రకటించారు. కానీ, 52 శాతం జనాభా గల బీసీలకు పారిశ్రామిక పాలసీ ఇంతవరకు ప్రకటించలేదు. అంటే బీసీలు పరిశ్రమలు–కంపెనీలు పెట్టడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదా. ఇక ఇటీవల రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెట్టలేదు. అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లను ఈ వర్సిటీల్లో పెట్టబోమని దర్జాగా విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెట్టమని చెప్పడానికి ఎన్ని గుండెలు కావాలి. ఈ కులాలంటే భయం లేదా! ఒకసారి ఓడిస్తే అప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలంటే ఏమిటో తెలుస్తుంది?

బీసీలకు ప్రాధాన్యత లేని శాఖలా?

ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 32 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. పదిహేడు సార్లు రెడ్లు, ఏడుసార్లు కమ్మ, మూడు సార్లు వెలమలు, రెండు సార్లు బ్రాహ్మణులు, రెండుసార్లు వైశ్యులు ముఖ్యమంత్రులయ్యారు. కానీ, 52 శాతం జనాభా గల బీసీలకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. సీఎం పదవి ఏమైనా అగ్రకులాల జాగీరా? టీఆర్ఎస్​ సర్కారులో బీసీలకు 4 మంత్రి పదవులిచ్చి..  8 శాతం జనాభా గల అగ్రకులాలకు సీఎం సహా ముఖ్యమైన 12 శాఖలను కేటాయించారు. బీసీలకు మత్స్య, పశుసంవర్థక, బీసీ సంక్షేమ శాఖ లాంటి ప్రాధాన్యత లేని, బడ్జెట్ లేని శాఖలు ఇచ్చి అవమాన పరుస్తున్నారు. ఇక బీసీ స్టడీ సర్కిల్ బడ్జెట్ ను రూ.50 కోట్ల నుంచి రూ.పది కోట్లకు తగ్గించారు. నిరుద్యోగులకు ఎలాంటి కోచింగ్ ఇవ్వకుండా బీసీ స్టడీ సర్కిల్స్​ ను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. ఆరేండ్లుగా సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు ఈ స్టడీ సర్కిల్స్ ద్వారా ఒక్కరు కూడా ఎంపిక కాలేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుంది. దీంతో బీసీ నిరుద్యోగులు వేల రూపాయలు అప్పులు చేసి ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు వెళుతున్నారు.

ఒక్క బీసీ రెసిడెన్షియల్​ స్కూలైనా కట్టారా?

కొత్తగా కట్టిన సెక్రటేరియట్​ కూల్చి మళ్లీ కట్టడానికి వందల కోట్ల బడ్జెట్ ఉంటుంది. ఇంకో వందేండ్లు చెక్కుచెదరకుండా ఉండే అసెంబ్లీ భవనాన్ని కూలగొట్టి, కొత్తది కట్టడానికీ బడ్జెట్ ఉంటుంది. కలెక్టరేట్​ భవనాలకు బడ్జెట్ ఉంటుంది. కానీ, చదువుకుని భవిష్యత్తులో శాస్త్రవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్, ముఖ్యమంత్రులు, మంత్రులు కాబోయే భావి పౌరులకు ఈ ఆరేండ్ల కాలంలో ఒక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్, బీసీ కాలేజీ హాస్టల్ కట్టాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎందుకు రాలేదు. 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఆగమేఘాల మీద భవనాలు కట్టడానికి వందల కోట్లు బడ్జెట్ కేటాయించే ఈ ప్రభుత్వానికి పేద పిల్లలు చదువుకునే గురుకుల పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లకు బిల్డింగ్​లు ఎందుకు కట్టడం లేదు. అలాగే గురుకుల పాఠశాలల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో కూడా వివక్ష చూపుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎక్కువ సదుపాయాలు కల్పించి బీసీలకు కల్పించకపోతే వారి హృదయాలు గాయపడవా?

బీసీలు చదువుకోవద్దా.. ఉద్యోగాలు చేయొద్దా?

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసి, ఆమరణ నిరాహార దీక్షలు చేసి ఇంజనీరింగ్, మెడిసన్, పీజీ, డిగ్రీ చదివే వారికి పూర్తి ఫీజులు ప్రభుత్వమే మంజూరు చేసేలా జీవో జారీ చేయించాం. కానీ, టీఆర్​ఎస్​ ప్రభుత్వం పూర్తి ఫీజులు ఇవ్వడం లేదు. ఇంజనీరింగ్ కాలేజీల్లో రూ.లక్ష ఫీజు ఉంటే రూ.35 వేలు మంజూరు చేస్తోంది. మిగతా ఫీజు కట్టలేక బీసీలు చదువు మానుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఫీజులను కేంద్రం ఇస్తుంది. మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు మంజూరు చేసింది. కానీ బీసీలకు పూర్తి ఫీజు ఇవ్వకపోవడం అన్యాయం కాదా? బీసీ ‘సి-’ గ్రూపులోని క్రిస్టియన్లకు, ‘ఈ’ గ్రూపులోని ముస్లింలకు పూర్తి ఫీజులు ఇచ్చి హిందూ బీసీలకు ఫీజు ఇవ్వకపోవడం ఎంత వరకు సబబు. దీనిపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సీఎం కేసీఆర్​ కనికరించడం లేదు. పూర్తి ఫీజులు ఇస్తే ప్రభుత్వానికి అదనంగా రూ.200 కోట్లు కూడా ఖర్చు కాదు. కానీ వేలాది మంది బీసీలు చదువుకొని పైకి వస్తారు. బీసీలు చదువుకోవడం ఈ ప్రభుత్వానికి  ఇష్టం లేదా? మేము గొర్రెలు–బర్రెలు మేపడానికి, చేపలు పట్టడానికి పోవాలా? చదువు–-ఉద్యోగాలు చేయొద్దా? అలాగే టీఆర్ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీల విద్య,- ఉద్యోగ రిజర్వేషన్లు అమలుపై క్రిమిలేయర్ నిబంధన విధించి అన్యాయం చేసింది.

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసి, ఆమరణ నిరాహార దీక్షలు చేసి ఇంజనీరింగ్, మెడిసన్, పీజీ, డిగ్రీ చదివే వారికి పూర్తి ఫీజులు ప్రభుత్వమే మంజూరు చేసేలా జీవో జారీ చేయించాం. కానీ, టీఆర్​ఎస్​ ప్రభుత్వం పూర్తి ఫీజులు ఇవ్వడం లేదు. ఇంజనీరింగ్ కాలేజీల్లో రూ.లక్ష ఫీజు ఉంటే రూ.35 వేలు మంజూరు చేస్తోంది. మిగతా ఫీజు కట్టలేక బీసీలు చదువు మానుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఫీజులను కేంద్రం ఇస్తుంది. మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు మంజూరు చేసింది. కానీ బీసీలకు పూర్తి ఫీజు ఇవ్వకపోవడం అన్యాయం కాదా? బీసీ ‘సి-’ గ్రూపులోని క్రిస్టియన్లకు, ‘ఈ’ గ్రూపులోని ముస్లింలకు పూర్తి ఫీజులు ఇచ్చి హిందూ బీసీలకు ఫీజు ఇవ్వకపోవడం ఎంత వరకు సబబు. దీనిపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సీఎం కేసీఆర్​ కనికరించడం లేదు. పూర్తి ఫీజులు ఇస్తే ప్రభుత్వానికి అదనంగా రూ.200 కోట్లు కూడా ఖర్చు కాదు. కానీ వేలాది మంది బీసీలు చదువుకొని పైకి వస్తారు. బీసీలు చదువుకోవడం ఈ ప్రభుత్వానికి  ఇష్టం లేదా? మేము గొర్రెలు–బర్రెలు మేపడానికి, చేపలు పట్టడానికి పోవాలా? చదువు–-ఉద్యోగాలు చేయొద్దా? అలాగే టీఆర్ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీల విద్య,- ఉద్యోగ రిజర్వేషన్లు అమలుపై క్రిమిలేయర్ నిబంధన విధించి అన్యాయం చేసింది.

బీసీలపై దాడులు పెరిగిపోతున్నాయి

ఈ మధ్యకాలంలో బీసీలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. నారాయణపేట్, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో 72 చోట్ల బీసీలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు జరిగాయి. పోలీసులకు కంప్లయింట్​ చేసిన ఎమ్మెల్యేల ఒత్తిడికి లొంగి దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం అగ్రకులాలకు వత్తాసు పలుకుతున్నందునే బీసీలపై దాడులు పెరిగిపోతున్నాయి. మరోవైపు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ను ఏండ్ల తరబడి నియమించడం లేదు. ఇన్​చార్జ్​లతోనే నెట్టుకొస్తున్నారు. బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు సెక్రటరీగా ఐఏఎస్ ఆఫీసర్లను నియమించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖలో, జిల్లాల్లో బీసీ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. వార్డెన్ పోస్టులు, హాస్టళ్లలో వర్కర్ల పోస్టులను భర్తీ చేయడం లేదు. 200 మంది స్టూడెంట్లు ఉన్నా కూడా వర్కర్లను నియమించకపోవడంతో సకాలంలో భోజనం అందడం లేదు. కొన్ని చోట్ల భోజనంలో క్వాలిటీ లేక హాస్టళ్లు నరక కూపాలుగా తయారయ్యాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇంకా చాలా బీసీ వ్యతిరేక చర్యలు ఉన్నాయి. టీఆర్ఎస్​ ప్రభుత్వం ఈ ఆరేండ్ల ఆరు నెలల కాలంలో ఈ కులాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ, అణచివేయడానికి అడుగడుగునా కుట్రలు చేస్తోందని స్పష్టంగా కనిపిస్తుంది.

– ఆర్.కృష్ణయ్య,

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు