బీసీ లెక్కలు తప్పు.. నిరూపించేందుకు నేను రెడీ: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

బీసీ లెక్కలు తప్పు.. నిరూపించేందుకు నేను రెడీ: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  • ఆ లెక్కలు కాంగ్రెస్ హైకమాండ్​కు అందజేసిన
  • గ్రామ పంచాయతీల వారీగా లెక్కలు బయట పెట్టాలి
  • ఏ పార్టీలో చేరను..ఏ పార్టీకి మద్దతియ్యనని కామెంట్​ 

హైదరాబాద్, వెలుగు: 
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ లెక్కలు తప్పని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆ లెక్కలన్నీ తప్పని నిరూపించడానికి తాను రెడీ అని.. సర్వేపై బహిరంగ చర్చకు తాను ఒక్కడినే వస్తానని ఆయన స్పష్టం చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మల్లన్న మాట్లాడారు. తాను ఏ పార్టీలో చేరనని, ఏ  పార్టీకి మద్దతివ్వనని చెప్పారు. బీసీ జేఏసీగా.. బీసీ సమస్యలపై పోరాడుతానని ప్రకటించారు. బీసీలకు ఏ పార్టీలో అన్యాయం జరిగినా పోరాడుతానని, బీసీ సమాజానికి అండగా ఉంటానన్నారు. 

త్వరలో బీసీ మేధావులతో చర్చిస్తానన్నారు. బీసీ వాదాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లి.. బీసీలందరినీ ఐక్యం చేస్తానన్నారు. ఆర్ కృష్ణయ్య బీసీ విద్యార్థుల స్కాలర్ షిప్స్ ఇతర సమస్యలపై పోరాడారని, రాజ్యాధికారం కోసం పనిచేయలేదన్నారు. తాను ఈ అంశంపై పోరాడుతానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ సీటుకు రాజీనామా ఎందుకు చేస్తానని మీడియా ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. కులగణన చేస్తామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్ గాంధీ అంటేనే తాను కాంగ్రెస్ లో చేరానని.. సీఎం పిలుపుతో చేరలేదన్నారు. 

కాంగ్రెస్ నుంచి తనని సస్పెండ్ చేయాలని ఎంతో కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, సస్పెండ్ చేసి తప్పు చేశారన్నారు. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఇచ్చిన లెటర్ ను ఫ్రేమ్ కట్టించానని మీడియాకు చూపించారు. కులగణన సమయంలో సీఎంకు సలహాలు ఇచ్చానని, దేశానికి ఆదర్శంగా ఉండాలని, ఈ లెక్కలతో  రాహుల్ గాంధీ గర్వంగా చెప్పుకోవాలని తాను సూచించానన్నారు. “కులగణనలో సీఎం, మంత్రులు చివరలో తూతూ మంత్రంగా వివరాలు ఇచ్చారు. 

సర్వే చేస్తున్నట్లు పబ్లిసిటీ చేయలేదు. అగ్రవర్ణాలను ఎక్కువ చూపి.. అణగారిన వర్గాలను తక్కువ చూపడానికి ఈ సర్వే చేశారు. సీఎం ప్రెస్ మీట్ పెట్టి తప్పులు చెబుతూ దొరుకుతున్నారు. నేను 7 గ్రామాల్లో కులగణన చేశాను. ప్రభుత్వం కూడా కులాల వారీగా జనాభా వివరాలను గ్రామ పంచాయతీ బోర్డుల్లో డిస్​ప్లే చేయాలి. కులగణన లెక్కలు తప్పు అని కాంగ్రెస్ హైకమాండ్ కు అందించానని, అందుకే రాష్ట్ర నేతలకు కోపం వచ్చింది” అని ఆయన అన్నారు. 

నా సస్పెన్షన్ తో  బీసీ ఉద్యమం ఆగదు

నా సస్పెన్షన్ తరువాత  బీసీ ఉద్యమం ఆగిపోతుందని సీఎం అనుకుంటున్నారని.. అలాంటి అభిప్రాయం ఉంటే మార్చుకోవాలని మల్లన్న అన్నారు. ఇపుడు ఉన్న బీసీలు పాత బీసీలు కాదని.. అన్యాయం జరిగితే కచ్చితంగా ప్రశ్నిస్తారని బీసీల ప్రతినిధిగా తాను  ప్రశ్నించానని ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డిని.. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పీసీసీ పదవి రూ.50 కోట్లకు కొన్నారని, రాజగోపాల్ రెడ్డి కూడా ఎన్నో విమర్శలు చేశారని, ఇటీవల  క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి సైతం పార్టీపై తప్పుగా మాట్లాడరని మల్లన్న గుర్తుచేశారు. వీళ్లకు షోకాజ్ నోటీసు ఎందుకు ఇవ్వలేదు? పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ లో అగ్ర వర్ణాలకే ఉంటుందా? అణగారినవర్గాలకు ఉండదా? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం తాను ఎంతో కష్టపడ్డానని, అప్పటి సీఎం కేసీఆర్ తనను ఎన్నో ఇబ్బందులు పెట్టినా తట్టుకున్నానని మల్లన్న చెప్పారు. మీరు  కుర్చీలో కూర్చోడం కోసం నేను కష్టపడ్డానన్నారు. 2028లో రాష్ట్రంలో బీసీ వ్యక్తి సీఎం కావడం ఖాయమని ఆయన అన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా కార్యకర్తలు సంతోషంగా లేరన్నారు. కార్పొరేషన్ పదవులు 33 ఇస్తే జగ్గారెడ్డి భార్య పేరు గౌడ్ అని ఇచ్చారని, బండ్రు శోభారాణి ఓసీ అయితే కురుమ కోటాలో ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. 

మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి ఎంపీ సీట్లలో ఎందుకు ఓడారు?

నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక పరిధిలో ఉన్న అన్ని  ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలిచిందని, మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి సీట్లు ఎందుకు ఓడారని మల్లన్న ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ మెంబర్ గా ఉన్న వంశీ చంద్ గెలిస్తే ఏఐసీసీకి తప్పుడు సమాచారం ఇస్తారని ఆయన్ని ఓడించారని.. మల్కాజ్ గిరిలో పరిచయం లేని పట్నం సునీతకు టికెట్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. భువనగిరిలో చామలను ఎంపీగా గెలిపించుకున్నారని అన్నారు.  నరేందర్ రెడ్డి ప్రచారానికి వెళ్లి గెలిచినా.. ఓడినా ఒకటే అని సీఎం అన్నారని.. ఇవేం వ్యాఖ్యలు అని మల్లన్న ప్రశ్నించారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల సత్తా చూపించాం

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల సత్తా చూపించామని తీన్మార్ మల్లన్న తెలిపారు. నల్గొండ టీచర్ సీటులో పూల రవీందర్ తో పాటు పోటీ చేసిన ఇతర బీసీ అభ్యర్థులు గణనీయంగా ఓట్లు సాధించారన్నారు. కరీంనగర్ సీటులో బీజేపీ బీసీ అభ్యర్థి మల్క కొమరయ్య గెలిచాడని, గ్రాడ్యుయేట్ సీటులో ప్రసన్న హరికృష్ణ గెలిచే అభ్యర్థిని ఓడించారని ఆయన అన్నారు. ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న బీజేపీ, కాంగ్రెస్, యూటీఎఫ్, పీఆర్టీయూ అభ్యర్థులను బీసీ అభ్యర్థులు ఇబ్బందులు పెట్టారని ఆయన గుర్తుచేశారు.