- ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయాలని విన్నపం
- భువనగిరి ఎంపీ సెగ్మెంట్పరిధిలోనే బీసీలకు ఎక్కువ అవకాశాలు
- ఎంపీ కోమటిరెడ్డి కామెంట్ల వెనక రీజన్ అదేనని సీనియర్ల అభిప్రాయం
నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో బీసీ లొల్లి కాక పుట్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రతి పార్లమెంట్సెగ్మెంట్లో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ప్రముఖంగా వినిపిస్తోంది. 2009లో బీసీలకు ఆలేరులో మాత్రమే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో భువనగిరి, ఆలేరు ఇవ్వగా, మళ్లీ 2018 ఎన్నికలకు వచ్చేసరికి సీన్పూర్తిగా మారిపో యింది. రెండు పార్లమెంట్సెగ్మెంట్ పరిధిలో వేర్వేరు చోట్ల సీట్ల పంపకాలు జరిగాయి.
భువనగిరి ఎంపీ పరిధిలో ఆలేరు, నల్గొండ ఎంపీ పరిధిలో మిర్యాలగూడ స్థానాలను బీసీలకు కేటాయించారు. అయితే ఇదే ఫార్మూలా వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగిస్తారనే నమ్మకం కలగడం లేదు. ఎంపీ కో మటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలకు అనుగుణంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే రెండు లేదా మూడు సీట్లు బీసీలకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2014 ఎన్నికల ఫార్మూలా అమలు చేస్తారా..?
భువనగిరి స్థానాన్ని బీసీలకు ఇస్తామని చెప్పడంతోనే డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి పార్టీ వీడారు. ఎంపీ వెంకటరెడ్డి భువనగిరిలో బీసీ చిచ్చు రాజేశారని, వచ్చే ఎన్నికల్లో ఈస్థానాన్ని గౌడ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి తెచ్చారని అనిల్ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదని సీనియర్లు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో జరిగిన సీట్ల పంపకాల్లో భాగంగా భువనగిరి, ఆలేరులో బీసీలకే చాన్స్ ఇచ్చారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుడైన పోతంశెట్టి వెంకటేశ్వర్లు భువనగిరిలో, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఆలేరులో పోటీ చేశారు. ఈసారి జరిగే ఎన్నికల్లో కూడా అదే ఫార్ములా అమలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నల్గొండ పార్లమెంట్‌పరిధిలో బీసీలకు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఉత్తమ్ దంపతులు కోదాడ, హుజూర్‌నగర్‌లో జానారెడ్డి కొడుకులు మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌లో పోటీ చేస్తామని చెబుతున్నారు. ఇక మిగిలేది నల్గొండ, దేవరకొండ మాత్రమే. నల్గొండ ఎంపీ వెంకటరెడ్డి సొంత సెగ్మెంట్ కాగా, దేవరకొండ ఎస్టీల రిజర్వు స్థానం. కాబట్టి బీసీలకు రెండు సీట్లతో పాటు, ఇంకో సీటు అదనంగా ఇవ్వాలన్నా భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే సాధ్యమవుతుంది. ఒక్కడ బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ముఖ్యంగా గౌడ, యాదవ సామాజిక వర్గాలకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. కావున భువనగిరిలో గౌడ్స్, ఆలేరులో యాదవులకు ఇస్తే, మున్నూరుకాపు కోటాలో ఎలాగు జనగాంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రేసులోఉన్నారని సీనియర్లు చెబుతున్నారు.
ప్రియాంక సభ తర్వాతే క్లారిటీ...
యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారనే దానిపై అప్పుడే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మూడు జిల్లాలో ఆయా సామాజిక వర్గాల ప్రకారం అధ్యక్షులను నియమించారు. కానీ సూర్యాపే ట డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో గొడవ జరగడంతో పాత అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్‌నే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అనిల్‌కుమార్ రెడ్డి వెళ్లిపోవడంతో అదే సామాజికవర్గానికి చెందిన లీడర్‌ను డీసీసీ పదవి లో కూర్చోబెట్టే అవకాశం ఉంది. ఉత్తమ్ వర్గానికి చెందిన అనిల్‌రెడ్డి పార్టీ నుంచి వెళ్లి పోవడంతో ఇప్పుడు యాదాద్రి జిల్లా అధ్యక్ష పదవి విషయంలో ఎంపీ కోమటిరెడ్డి మాటే చెల్లుబాటు కానుంది.
కొల్లాపూర్‌లో జరిగే ప్రియాంకగాంధీ సభలో కాంగ్రెస్‌లో భారీ చేరికలు ఉంటాయని తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నేత పాత కాంగ్రెస్ సీనియర్ నేత చింతల వెంకటేశ్వరరెడ్డి తిరిగి పార్టీలోకి వస్తా మని చెబుతున్నారు. ప్రియాంక సభ తర్వాతే యాదాద్రి జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు కొలిక్కి వస్తాయని సీనియర్ లీడర్ ఒకరు చెప్పారు.