విశ్లేషణ: కులాలవారీగా లెక్కలు తీస్తేనే బీసీలకు రాజ్యాధికారం

దేశ జనాభాలో బీసీ కులాల ప్రజలు సగానికిపైనే ఉంటారు. కానీ రాజ్యాధికారం విషయానికి వస్తే బీసీల వాటా నామమాత్రంగానే ఉంటోంది. పదేండ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణలో బీసీ కులాల వారీగా లెక్కలు తీయాలనే డిమాండ్​ ఇటీవల ఊపందుకుంది. జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీ కులాల వారీగా లెక్కలు తీస్తున్నారు. దాని ఆధారంగా వారికి రిజర్వేషన్లు దక్కుతున్నాయి. కానీ బీసీల లెక్కలు లేకపోవడంతో వారికి న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్ల వాటా కోల్పోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రజల డిమాండ్​ మేరకు కులాల వారీగా లెక్కలు తీస్తే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుంది.

స్వాతంత్ర్యం రాకముందు అంటే 1931 నుంచి మనదేశంలో జనాభా లెక్కల సేకరణ మొదలైంది. అప్పుడు మనదేశానికి సర్వాధికారాలు లేవు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన చేపడుతున్నారు. ఇది మంచి విషయమే అయినా, బీసీ కులాలకు సంబంధించి ప్రత్యేకంగా కులాల వారీగా జనగణన చేపట్టడం లేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏండ్లు దాటినప్పటికీ బీసీ కులాల వారీగా జనాభా లెక్కల సేకరణను ఎందుకు చేపట్టడం లేదు. ఇందులోని మర్మం ఏమిటో కూడా అంతుచిక్కడం లేదు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల జనగణన చేపట్టినప్పుడు బీసీ కులాల్లోని ప్రతి కులానికి సంబంధించిన లెక్కలు కట్టడం అనేది అత్యవసరం. 

దేశవ్యాప్తంగా బీసీ కులాలన్నీ ఇదే కోరుకుంటున్నాయి. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ సమస్య మాత్రం తీరడంలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే వెంటనే బీసీలకు అధికారాలు కల్పిస్తామని కేసీఆర్‌‌‌‌‌‌ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఓట్లు దక్కే వరకూ ఓ మాట.. దక్కాక ఇంకో మాట అన్నట్టు ఇప్పుడు బీసీ జనాభా లెక్కలు కూడా లేవు. వాళ్లకు అధికారాలు కూడా లేవు. దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు అధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. దీనికి పరిష్కారం దక్కలంటే కులాల వారీగా బీసీల లెక్కలు తీయాల్సిందే. అప్పుడు ప్రజల డిమాండ్ నెరవేర్చినట్టు అవుతుంది. బీసీ కులాలకు రాజ్యాధికారం దక్కుతుంది.

ఎన్నికలు వచ్చినప్పుడే తెరపైకి

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950 జనవరి 26 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.1952లో మనదేశానికి తొలిసారి సాధారణ ఎన్నికలు జరిగాయి. అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకుని నేటి వరకు రాజకీయాలు ఎంత ఖరీదుగా మారాయో.. నాయకుల పని తీరులో ఎన్ని మార్పులు వచ్చాయో కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికైనా సులువుగా తెలిసిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీసీల గురించి పట్టించుకునే పార్టీలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. 

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్​ వచ్చినప్పుడు మాత్రమే బీసీల రాజ్యాధికారం అంశం, అలాగే కులాల వారీగా బీసీల జనాభా లెక్కించే విషయం తెరపైకి వస్తున్నాయి. తీరా ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత ఈ అంశం కనుమరుగు కావడం ఆనవాయితీగా వస్తోందన్నది నగ్నసత్యం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందాక సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి విషయం ప్రతి ఒక్కరికీ తెలుస్తూనే ఉంది. దేశంలో రాజ్యాధికారంలో ఉన్న వ్యక్తులు ఎంతమంది? వారి సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ నేపథ్యం ఏమిటి? కులాల ప్రాతిపదికన వారి జనాభా శాతం ఎంత? అనుభవిస్తున్న పదవుల శాతం ఎంత? ఇవన్నీ కూడా జనాలకు స్పష్టంగా తెలుస్తోంది. రాజ్యాధికారం సాధిస్తున్న వారికి, బీసీ కులాలకు మధ్య ఏనుగుకు, ఎలుక పిల్లకు ఉన్నంత తేడా ఉంటోందని అందరికీ అర్థమవుతోంది.

మేధావులకు తెలియదా?

దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే ఈ ప్రక్రియ ముందుకు సాగుతుంది. కానీ, ఇందులో బీసీ కులాలు, అందులోని ఉపకులాల ప్రాతిపదికన జనాభా లెక్కల సేకరణ ఎందుకు చేపట్టడం లేదనేది ఇప్పుడు మిలియన్​ డాలర్ల ప్రశ్న. దేశంలో మొత్తం ఎన్ని బీసీ కులాలున్నాయి? అందులో ఎన్ని ఉప కులాలు ఉన్నాయి? స్త్రీ, పురుష, బాలబాలికల, వయసు పరంగా జనాభా శాతం ఎంత? వారి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ నేపథ్యం ఎలా ఉంది? అనే అంశాలను ఎందుకు బయటపెట్టడం లేదు. ఇందులోని మర్మం ఏంటి. ఇదే బహుజనుల రాజ్యాధికారానికి అడ్డంకని దేశవ్యాప్తంగా ఉన్న బహుజన మేధావులకు తెలియదా? దేశవ్యాప్తంగా బీసీ వర్గాలకు చెందిన మేధావులు, రాజకీయ నాయకులు, ప్రొఫెసర్లు, కవులు, కళాకారులు, రచయితలు, వివిధ బీసీ సంఘాల్లోని కులపెద్దలు, విద్యార్థి నాయకులు ఎంతగా మొర పెట్టుకుంటున్నా స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి బీసీ కులాల లెక్కలను ఎందుకు సేకరించడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా బీసీ కులాల స్థితి గతులను తెలుసుకునేందుకు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? ఇవే అనుమానాలు దేశవ్యాప్తంగా ఉన్న బీసీల్లో నెలకొన్నాయి.

అధికారం పోతుందన్న భయమా?

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్ అణచివేయబడిన కులాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తూ విభిన్న కులాల్లో వెనుకబడిన వారందరికీ ‘జనం ఎంతో - వారికి అంత వాటా’ అనే సూత్రాన్ని ప్రస్తావించారు. కానీ, 70 ఏండ్లు గడిచినా రాజ్యాంగం కల్పించిన ఫలాలు దక్కాల్సిన వారికి దక్కడం లేదన్నది ముమ్మాటికి వాస్తవం. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల్లోని కులాల వారీగా జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. కానీ బీసీ కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించడం మాత్రం చేయడం లేదు. దీంతో వారికి న్యాయబద్ధంగా దక్కాల్సిన అవకాశాలు కోల్పోవాల్సి వస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న బీసీ కులాల ప్రజలంతా కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని కోరుకుంటున్నారు. కానీ ఈ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయడం లేదు. 

ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు బీసీ కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలంటూ అసెంబ్లీల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపుతున్నాయి. విభిన్న రాష్ట్రాల్లో బీసీ కుల సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాలకు వినతిపత్రాలు అందజేస్తున్నాయి. అలాగే మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు ముక్త కంఠంతో బీసీల కులాల వారీగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, బీసీ కులాల జనాభాను లెక్కించడంపై అడుగు ముందుకు పడటం లేదు. ఇలా చేస్తే అగ్రకులాల పెత్తనానికి అడ్డుకట్ట పడుతుందని భయమా? రాజ్యాధికారం పోతుందనే అనుమానమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీసీ కులాలవారీగా జనాభాను లెక్కిస్తే వారికి జనాభా ప్రాతిపదికన దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కుతాయి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కోటా దక్కి రాజ్యాధికారానికి బాటలు పడతాయి. బీసీ కులాలు అభివృద్ధి దిశలో పయనించే వీలు కలుగుతుంది. అందువల్ల ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకుని కులాల వారీగా బీసీల జనాభాను లెక్కించేందుకు చర్యలు తీసుకోవాలి.

పోలం సైదులు, సోషల్‌ ఎనలిస్ట్‌