- త్వరలోనే కులాలవారీగాడేటా రిలీజ్ చేస్తం
- బీసీ సంఘాలను పిలిచి మాట్లాడ్తమని వెల్లడి
- సర్వే రిపోర్టుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి పవర్‌పాయింట్ ప్రజంటేషన్
హైదరాబాద్, వెలుగు: గతంతో పోలిస్తే రాష్ర్టంలో బీసీల జనాభా పెరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కులగణన సర్వే రిపోర్టుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్ లో కులగణన రిపోర్ట్, సర్వే చేపట్టిన విధానంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గతంలోని లెక్కలతో పోలిస్తే రాష్ట్రంలో బీసీల జనాభా పెరిగింది. బీఆర్‌ఎస్ పాలనలో 51.09 శాతంగా నమోదైన బీసీ జనాభా.. ఇప్పుడు 56.33 శాతానికి పెరిగింది. అలాగే ఎస్టీల జనాభా 9.8 శాతం నుంచి 10.45 శాతానికి పెరిగింది. ఓసీల జనాభా 21.55 శాతం నుంచి 15.79 శాతానికి తగ్గింది” అని ఉత్తమ్ వివరించారు. ‘‘బీసీల జనాభా తగ్గిందని ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి. అందులో వాస్తవం లేదు. ప్రతిపక్షాలు ఏ లెక్కలను ఆధారంగా తీసుకుని ప్రస్తుత లెక్కలను పోల్చుతున్నాయి?” అని ప్రశ్నించారు.
కులాల వారీగా డేటాను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. వ్యక్తిగత వివరాలు మాత్రం బయటపెట్టమని స్పష్టం చేశారు. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నామని చెప్పారు. కులగణన రిపోర్టును బీసీ సంఘాలు చింపివేశాయి కదా? అని మీడియా ప్రశ్నించగా.. వాళ్లను పిలిచి మాట్లాడుతామని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ రిపోర్టును కాలబెట్టినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించగా.. అది పీసీసీ పరిధిలోని అంశమని పేర్కొన్నారు.
ఇవే నిజమైన లెక్కలు..
రాష్ట్రంలో కులాల వారీగా జనాభాకు సంబంధించి కులగణన సర్వే లెక్కలే నిజమైనవని ఉత్తమ్ తెలిపారు. ‘‘2011 జనాభా లెక్కల తర్వాత క్షేత్ర స్థాయిలో నిర్వహించిన సర్వే ఇది. ప్రతిపక్షాలు తప్పుడు గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కులాల వారీగా గతంలో ప్రామాణిక డేటా సేకరించలేదు. గత అధ్యయనాలు అసంపూర్ణంగా, అనధికారికంగా ఉన్నాయి. మేం చేసిన కులగణన సర్వే చట్టబద్ధమైనది” అని పేర్కొన్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎంపీ మల్లు రవి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పక్కాగా సర్వే: గుత్తా
ప్రభుత్వం పకడ్బందీగా కులగణన సర్వే నిర్వహించిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అధికారులు ప్రామాణికంగా, పక్కాగా సర్వే నిర్వహించారని చెప్పారు. తాను కూడా తన కుటుంబ వివరాలను సొంత గ్రామంలో అధికారులకు అందించినట్టు పేర్కొన్నారు. కావాలనే కొందరు ప్రతిపక్ష నేతలు కులగణన రిపోర్టుపై అనుమానాలు, అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వాళ్ల మాటలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. తాము చేపట్టిన సర్వే సమగ్రంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.