దేశంలో బీసీలు చాలా ఏండ్లుగా అన్యాయానికి గురవుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా.. రాజ్యాంగంలో ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం వల్ల రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. బీసీలకు సొంత రాజకీయ వేదిక లేక అధికారానికి దూరంగానే ఉన్నారు. పోరాటం చేసి కనీస హక్కులను సాధించుకోవడంలోనూ వెనుకబడిపోయారు. అగ్రవర్ణాల పార్టీలు, పాలకులతో కలిసి పనిచేసినంత కాలం రాజ్యాధికారం దక్కదనే నిజం తెలిసీ రాజ్యాధికారం వైపు బీసీలు ఆలోచన చేయకపోవడం బాధాకరం. ఇప్పటికైనా కళ్లు తెరిస్తే రానున్న తరం క్షమిస్తుంది. లేకపోతే బానిసత్వం అనుభవించాల్సిందే.
ఇన్ని సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ జనాభాను లెక్కిస్తున్న ప్రభుత్వాలు బీసీల జనాభా లెక్కలను ఎందుకు పట్టించుకోవడం లేదో సమాధానం చెప్పాలి. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు పంచాలని కొందరు, వాటిని ఇంకా పెంచాలని మరికొందరు గత కొన్నేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. కొందరు బీసీ నేతలు ఆధిపత్య పాలకుల పంచన చేరి దళారులుగా మారుతున్నారు. రాజ్యాధికారం కోసం కాకుండా వ్యక్తిగత అభివృద్ధి, పేరుప్రఖ్యాతి కోసం బహుజనవాదం ముసుగులో ఆధిపత్య పాలకులతో తిరుగుతున్న బీసీ నేతలు ఇకనైనా ఆలోచన చేయాలి. బీసీల్లో 10% మంది కలిసి వచ్చినా 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఈపాటికి బహుజన సమాజం బలమైన శక్తిగా మారేది. దేశంలో బీసీల సమస్య తీరేది. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లను రాజ్యాంగం కల్పించింది. దాన్ని ఈ దేశంలో ఎవ్వరూ కదపలేరు. అది రాజ్యాంగం వారికి కల్పించిన హక్కు. కానీ బీసీలకు రాజ్యాంగంలో ఆ అవకాశమే లేదు. దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలు ఇన్నేళ్లుగా అన్యాయానికి బలవుతున్నా.. ఈ ఆధిపత్య పాలకులు పట్టించుకోవడం లేదు. పైగా బీసీల ఎజెండాను ఆధిపత్య పాలకులు హైజాక్ చేసి లక్ష్యాన్ని దారి తప్పిస్తే 75 సంవత్సరాల నుండి బానిసత్వం అనుభవిస్తూనే ఉన్నారు. దీంతో విముక్తి కోసం అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు విలువ వృథా అవుతోంది. ఈ ఆధిపత్య పాలకులు బీసీ వర్గాలవారిని ఏ విధమైన ఆలోచన చేయకుండా, ఎవర్నీ ప్రశ్నించడం చేతకాకుండా, ఏ నిజాన్ని చూడకుండా బానిసలుగా జీవించేలా చేశారు. బీసీలను ఉద్యమాల వైపు నడవకుండా సంఘటితం కాకుండా చూస్తున్నారు.
ఇకనైనా ఆలోచించండి..
తెలంగాణలో బీసీలు 56 శాతమని సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ చెపుతోంది. కానీ అధికారం దక్కలేదు. బీసీలను రాజకీయంగా దెబ్బతీయాలన్న ఆధిపత్య పాలకుల ఎత్తుగడను విజ్ఞులైన బీసీ మేధావులు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇంకా ఎన్నాళ్లు మౌనంగా ఉంటారు? తెలంగాణ ఏర్పడి ఏడేండ్లు గడిచింది. కానీ సొంత రాష్ట్ర పాలనలో కూడా బలహీన వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఆశించిన స్థాయిలో అందలేదన్నది వాస్తవం. దీనికి ప్రధాన కారణం అధిక సంఖ్యాకులైన బీసీలకు నాయకత్వంలో రాజ్యాధికారం లేకపోవడమే. అందువల్ల రాజ్యాధికారం సాధనే ముఖ్యం అనే అవగాహనతో, ప్రజలను చైతన్యం చేయడానికి, ఆ దిశలో జరిగే చైతన్య కార్యక్రమాల్లో జనాల్ని భాగస్వాములను చేసే లక్ష్యంతో రాజకీయ వేదిక కాకున్నా, సామాజిక వేదికగానైనా పనిచేసే ఒక ప్రత్యేక బీసీ వేదిక తక్షణం అవసరం ఉంది. ఈ సందర్భంగా సామాజిక, రాజకీయంగా చైతన్యవంతులైన విద్యావంతులు, మేధావులు బీసీలను రాజ్యాధికారం సాధన దిశగా చైతన్యం చేయడానికి ‘బోధించు, సమీకరించు, ఉద్యమించు' అనే అంబేద్కర్ సూక్తిని మార్గదర్శకంగా చేసుకొని ముందుకు నడిపించే
వేదికై నడవాలి. సంఘటితమై రాజ్యాధికారం సాధించాలి.
మద్రాసు శూద్ర ఉద్యమాన్ని గుర్తుకు తేవాలి..
బీసీ భావజాల వ్యాప్తి అవసరాన్ని, అవకాశాల పంపిణీలో దశాబ్దాలుగా నెలకొన్న అసమానతలకు సంబంధించిన గణాంకాల సేకరణ ప్రాధాన్యతను గుర్తించి, బీసీల మధ్య ఐక్యత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఐక్యత ప్రాధాన్యతను అందరికీ తెలియజేస్తూ కచ్చితంగా విజయం సాధించే దిశగా ప్రయాణం, ప్రయత్నం చేయలేకపోతే మనుగడ ఉండబోదని బీసీలకు వివరించాలి. తెలంగాణాలో బీసీలు రాజ్యాధికార సాధనలో విజయం సాధించేలా చేయాలి. 1922 నాటి మద్రాసు శూద్ర ఉద్యమాన్ని గుర్తుకు తేవాలి. ఇంతవరకు రాజ్యాధికారం సాధించని ఇతర రాష్ట్రాల బీసీలకు మార్గదర్శకులు కావాలనే ఆకాంక్షతో, తెలంగాణలో ఉద్యమం మిగిలే ఉందని, ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే అది సమసి పోలేదని ఆధిపత్య పాలకులకు తెలిసేలా.. 'బీసీలకు రాయితీలు కాదు.. రాజ్యాధికారం కావాలి' అన్న నినాదంతో బీసీ నాయకులు ఉద్యమం చేయాలి.
- శ్రీనివాస్ తిపిరిశెట్టి,సీనియర్ జర్నలిస్ట్