దేశవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలి

న్యూఢిల్లీ, వెలుగు: యూనియన్ బడ్జెట్‌లో బీసీలకు రూ. 2 లక్షల కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. బుధవారం ఆయన ఢిల్లీలో  కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. దేశంలో ఉన్న75 కోట్ల మంది బీసీలకు కేంద్ర బడ్జెట్‌లో రూ.1,400 కోట్లు మాత్రమే కేటాయించడమేమిటని ప్రశ్నించారు. ఇది బీసీలను అవమానించడమేనని.. ఈ నిధులు ఏ మాత్రం సరిపోవని కేంద్ర మంత్రికి తెలిపినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల మాదిరిగా దేశవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ స్కీంలు అమలు చేయాలని సూచించినట్లు తెలిపారు.

రాజ్యాంగ బద్ధమైన మండల్‌ కమిషన్‌, బీసీ అభివృద్ధి కోసం చేసిన 40 సిఫార్సుల్లో 16 ఆర్థికాభివృద్ధికేనని వెల్లడించారు. ఇందులో ఒక్క సిఫార్సు కూడా కేంద్రం అమలు చేయలేదన్నారు. దేశంలో కులవృత్తులు – చేతివృత్తులు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కుల వృత్తులు కోల్పోయి ఆకలి చావులకు గురవుతున్న ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలన్నారు. తాము చేసిన విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.