మంచిర్యాల బీసీలకు ఆశాభంగం

  • బీసీ నినాదాన్ని పట్టించుకోని ప్రధాన పార్టీలు
  •     రెండోసారి కూడా బీసీ లీడర్లకు చుక్కెదురు 
  •     బరిలో ఉంటారా? పోటీ నుంచి తప్పుకుంటారా? 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల నియోజకవర్గంలోని బీసీలకు మరోసారి ఆశాభంగం కలిగింది. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలకే ఈసారి టికెట్​ కేటాయించాలన్న డిమాండ్​ను ప్రధాన రాజకీయ పార్టీలు పట్టించుకోలేదు. పార్టీలకతీతంగా నాయకులు ఏకమై  కొన్ని నెలలుగా ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఓవైపు బీసీ నినాదం బలంగా వినిపిస్తుండగానే మరోవైపు మూడు  పార్టీలు ఓసీలకు టికెట్లు కేటాయించి బీసీల పట్ల తమ వైఖరిని చాటుకున్నాయి. 

ముందుగా బీఆర్​ఎస్​ సిట్టింగ్​ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావుకు టికెట్​ ఇచ్చి బీసీలను నిరాశపర్చింది. ఆ తర్వాత కాంగ్రెస్​ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావును అభ్యర్థిగా ప్రకటించి బీసీ సామాజిక వర్గానికి  మొండిచేయి చూపింది. తాజాగా గురువారం బీజేపీ సైతం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావుకు టికెట్​ కేటాయించి బీసీల ఆశలను వమ్ము చేసింది. 

రెండోసారీ నిరాశే..

నియోజకవర్గంలో బీసీలు 60% , ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు 38 % ఉండగా, ఓసీలు కేవలం రెండు శాతమే ఉన్నారు. గత 70 ఏండ్లలో ఒక్కసారి మాత్రమే బీసీకి చాన్స్​ రాగా, మిగతా 65 సంవత్సరాలుగా ఓసీలే రాజ్యమేలుతున్నారు. ఈ నేపథ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో  బీసీ నినాదం తెరపైకి వచ్చింది. పార్టీలకతీతంగా నాయకులు ఏకమై బీసీ ఉద్యమాన్ని కొనసాగించారు. ఊరూరా కమిటీలు వేసి, నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు చేసి రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచారు. 

తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి జెండాలు వదిలేయడంతో బీసీ నినాదం మరుగునపడింది. మళ్లీ ఎన్నికలు రాగానే కొత్త నాయకత్వం తెరపైకి వచ్చి బీసీ నినాదాన్ని భుజానికి ఎత్తుకుంది. ఈసారి మరింత బలంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్​రెడ్డి దానిని హైజాక్​ చేశారు. బీఆర్​ఎస్​ టికెట్​ ఆశించి భంగపడ్డ ఆయన టికెట్​ తనకు ఇవ్వకుంటే బీసీలకు ఇవ్వాలని పార్టీ హైకమాండ్​ను డిమాండ్​ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ అరవింద్​రెడ్డి బీసీలను గాలికి వదిలేసి బీఆర్​ఎస్​ అభ్యర్థిని గెలిపించాలని పిలునివ్వడంతో బీసీ లీడర్లు కంగుతున్నారు.

బీజేపీ సైతం..

ఈసారి ఎన్నికల్లో బీజేపీ బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకోవడం, బీసీలకు ఇతర పార్టీలకంటే ఎక్కువ సీట్లు కేటాయిండం వల్ల బీసీ నాయకులు ఆ పార్టీపై ఆశలు పెట్టుకున్నారు. బీసీ కోటాలో టికెట్​వస్తుందని డాక్టర్​ బీవీ.రఘునందన్​ బీజేపీలో చేరగా, అంతకుముందే మరో డాక్టర్​ నీలకంటేశ్వర్​గౌడ్​ కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. నస్పూర్​ మున్సిపల్​ వైస్ చైర్మన్​ తోట శ్రీనివాస్​ బీఎస్పీలో చేరి టికెట్​ దక్కించుకున్నారు. 

అనంతరం మంచిర్యాల టికెట్​ కోసం బీజేపీ హైకమాండ్​  రఘునందన్​తో పాటు మంచిర్యాల మున్సిపల్​ వైస్​చైర్మన్​ గాజుల ముఖేశ్​గౌడ్​ పేర్లను పరిశీలిస్తోందన్న వార్తలు వచ్చాయి. చివరకు ఆ పార్టీ సైతం ఓసీ లీడర్​కే టికెట్​ కేటాయించడంతో బీసీ లీడర్లకు చుక్కెదురైంది.  

ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్​ ఇవ్వకుంటే మంచిర్యాల నియోజకవర్గ రాజ్యాధికార సాధన ఐక్యవేదిక ద్వారా ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలుపుతామని బీసీ లీడర్లు ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది ఆసక్తి కలిగిస్తోంది. కాగా, రెండు మూడు రోజుల్లో  సమావేశమై భవిష్యత్​ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకోవాలని చర్చిస్తున్నట్టు సమాచారం.