తెలంగాణ రాజకీయాల్లో  బీసీలెక్కడ?

కర్నాటకలో కాంగ్రెస్ విజయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సిద్ధరామయ్య వంటి శ్రేష్టమైన నాయకత్వం బలమైన కారణాల్లో ఒకటి. వారి అహిందా ఉద్యమం గెలుపునకు తోడ్పడ్డది. కర్నాటక మాజీ సీఎం దేవరాజ్ అర్స్ నాయకత్వంలో కాంగ్రెస్ చేసిన బీసీల అభివృద్ధి చెప్పుకోదగినది. దానికి తోడు సిద్ధరామయ్య అహిందా ఉద్యమం బీసీల్లో ఒక నమ్మకాన్ని ఇచ్చింది. కన్నడ భాషలో అహిందా అంటే అల్పసంఖ్యాకులు, వెనుకబడిన కులాలు, దళితులు అనే అర్థం. మరి తెలంగాణ పరిస్థితి ఏంటి? ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ బీసీలను పట్టించుకుందా? 75 ఏండ్లలోఒక్క బీసీ ముఖ్యమంత్రిన్నైనా కాంగ్రెస్ చేసిందా? ఇప్పుడైనా బీసీ ముఖ్యమంత్రిని చేస్తారనే నమ్మకాన్ని ఇస్తుందా? కాంగ్రెస్ అంటే ఒక సామాజిక వర్గ పార్టీనేనా? అత్యధిక ఎమ్మెల్యేలు, సీఎంలు అందరూ ఒకే సామాజిక వర్గం నుంచి కనిపిస్తారు. పాలసీపరంగా చూసినా ఏనాడైనా జాతీయ కాంగ్రెస్ బీసీల సమస్యలను పట్టించుకుందా? వారి తదనంతరం వచ్చిన బీజేపీ కూడా బీసీలకు పెద్దగా చేసిందేమీ లేదు. బీఆర్ఎస్​ఈ రెండు పార్టీలకు భిన్నమేమీ కాదు. 

అన్నిరకాలుగా అన్యాయం..

బీసీలు అధికారానికి, అవకాశాలకు, అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడేసిన కులాలుగా మిగిలిపోతున్నారు. దురదృష్టవశాత్తు ఆధిపత్య వర్గాల పార్టీలు ఎప్పుడు బీసీలను ఓటు బ్యాంకులుగానే చూస్తూ వస్తున్నాయి. పార్టీలు తమ అధికార, ధన, కుల బలం ఉపయోగించి బీసీలను పౌరులుగా కాకుండా ఓటర్లుగానే పరిగణిస్తున్నాయి. అడపాదడపా ఒకరికో ఇద్దరికో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం మొత్తం బీసీల కోసమే పనిచేస్తున్నట్టు భ్రమలు కల్పిస్తున్నారు. ఎవరైనా నిలబడి అన్యాయాన్ని ప్రశ్నిస్తే దూషణలు, బెదిరింపులు. తెలంగాణలో బీసీలు 60 శాతానికి పైగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 93 శాతం. ప్రజాస్వామ్యంలో మెజారిటీనే అధికారం. 60 శాతం బీసీలు అంటే అధికారమే కాదా? కానీ కుల ఆధిపత్యంతో నడుస్తున్న సామాజిక వ్యవస్థలో ఎదిగిన కులం, ధనం, అధికారాన్ని శాసిస్తున్నాయి. వెనుకబడిన కులాలను, వారి నాయకులను అడ్డుకోవడమే నేటి ఎదిగిన కుల పార్టీల లక్ష్యంగా మారింది. రాజ్యాంగం కల్పించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి ఈ పార్టీ లు ఏ మాత్రం కట్టుబడి లేవు. రాజకీయ నాయకుల మాటలకు చేతలకు ఏమాత్రం సంబంధం లేదు. ఆశలు చూపించడం తప్ప ఆచరణ శూన్యం. అధికారులు కూడా అదే కుల ఆధిపత్య శక్తుల నుంచి రావడంతో అభివృద్ధి, అవకాశాలు, అధికారం ఎదిగిన కులాల హక్కుగా మారిపోయింది. మనం ప్రజాస్వామ్యం లో ఉన్నామా లేక కులస్వామ్యమే ప్రజాస్వామ్యంగా నడుస్తున్నదా? పార్టీలు కులాధిపత్యంతో అధికారం, అభివృద్ధి, అవకాశాలను ఎదిగిన కులాలే కబ్జా చేయడం రాజ్యాంగ విరుద్ధం.

ఐక్యంగా ఉద్యమిస్తే..

కర్నాటకలో ఎన్నికలు రెండు పార్టీల మధ్య హోరాహోరీగా జరిగాయి. కానీ తెలంగాణలో మూడు బలమైన పార్టీల మధ్య ఎన్నికలు జరిగే ఆస్కారం ఉన్నది. కానీ లోపాయ కారి ఒప్పందాలను ప్రజలు గమనించడం చాలా కష్టం. పార్టీల మధ్య పొత్తులు, ఎత్తులు ఎలా ఉంటాయో వేచి చూడాలి. సామాజిక, వామపక్ష నాయకత్వంలో కొన్ని పార్టీలు ఉన్నప్పటికీ వాటికి అధికార, ఆర్థిక హంగులు లేవు. అందుకే వాటికి రావాల్సిన గుర్తింపు, గౌరవం రావడం లేదు. సామాజిక గౌరవం కోసం సామాజిక శక్తుల కదలికలు పలు రూపాల్లో ఉన్నాయి. పౌర సమాజంలో ఆలోచన శక్తి బలంగా ఉన్నది. సమస్యల ఆలోచనలు, సామాజిక కదలికలకు తోడై ఐక్యంగా ఉద్యమిస్తే తెలంగాణ పరిస్థితి విప్లవాత్మక మార్పులకు తెర తీస్తుంది. కానీ తెలంగాణలో పార్టీలు బీసీలను అధికారానికి అంతులేని దూరాలకు నెట్టివేశాయి. ఎన్నాళ్లు చూస్తూ ఉందాం? ఈ బలవంతుల అరాచకాలను..శూద్ర, దళిత, మైనారిటీ, ఆదివాసీ ఉద్యమం కోసం కలిసి పోరాడుదాం రండి.

‑ ప్రొ. ఎస్. సింహాద్రి, రాష్ట్ర అధ్యక్షుడు, సమాజ్​వాదీ పార్టీ, తెలంగాణ