భారత రాజ్యాంగం ప్రకారం బీసీలకు కనీస నిర్వచనం, గుర్తింపు లభించడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. రాజ్యాంగంలో రాసుకున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం దక్కాలంటే రాజ్యాధికారం అవసరం అని తెలుసుకోవడానికి ఐదు దశాబ్దాలు దాటింది. తమ జనాభా 50% ఉంది కాబట్టి అన్ని రంగాల్లో 50% వాటాలను సాధించాలని బీసీలు తెలుసుకోవడానికి ఆరు దశాబ్దాలు గడిచాయి.
అధికారం సాధించడానికి రాజకీయ మార్గం వెతుక్కునేసరికి అప్రమత్తమైన ఆధిపత్య కులాలు రాజకీయ రంగాన్ని లక్షల కోట్ల వ్యవస్థగా అవినీతిమయం చేశారు. ఇక రాజ్యాధికార బాటకు వెళ్లే కనీస ఆలోచన చేయకుండా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను 'ఎం' లతో మజిల్, మనీ. మాఫియాలతో, కార్పొరేటీకరణ, అనైతిక విలువలతో నింపేశారు. రాజ్యాధికారం బీసీలకు అందనంత దూరంలో చేర్చారు. ఈ నేపథ్యంలో బీసీలు ఒక శక్తిగా ఏర్పడాల్సిన అవసరం ఉంది.
మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మణ వ్యతిరేక పోరాటం చేసిన తర్వాత శూద్రులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఫలితంగా బీసీలకు, ఎస్సీలకు రిజర్వేషన్లు లభించాయి. ముంబై రెసిడెన్సీలో పుణే నుంచి మహాత్మ జ్యోతిరావు పూలే సాంస్కృతిక విప్లవ పోరాటం చేశారు. ఒకవైపు స్వాతంత్ర్య ఉద్యమం నడుస్తున్న క్రమంలోనే బ్రాహ్మణ వ్యతిరేక పోరాటం చేస్తున్న బీసీలు వేరువేరుగా కులాలుగా విడిపోయి తమ కులాల అభ్యున్నతి కోసం ఉద్యమాలు చేయడమే కాకుండా విద్యను అందించేందుకు పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశారు.
మరికొందరూ రాజకీయ పార్టీలు కూడా పెట్టారు. స్వాతంత్రోద్యమం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో దేశమంతా ఉధృతంగా మారిన నేపథ్యంలో సోషలిస్టు పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు కూడా ఆవిర్భవించాయి. ఉత్తరప్రదేశ్‌లో యాదవులైన మండల్, ములాయం సింగ్ యాదవ్ జనతా పార్టీల ద్వారా ఎదిగారు. సొంత పార్టీలు కూడా పెట్టారు. 1934లోనే కుర్మీలు (వ్యవసాయ బీసీ కులం), కోయిరీలు, యాదవులు కలిసి త్రివేణి సంగమం అనే పార్టీని స్థాపించి స్థానిక ఎన్నికల్లో పోటీ చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం తమిళనాడులో జస్టిస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొని గెలిచి అధికారం కూడా చేపట్టింది. అత్యధికంగా బ్రాహ్మణేతరులు గెలిచారు. మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో అంబేద్కర్ షెడ్యూలు కులాల ఫెడరేషన్ ఏర్పాటు చేశాడు. ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడులో స్వాతంత్ర్యానికి పూర్వమే బీసీలు రాజకీయాలు చేశారు.
యూపీ, బిహార్లో సీఎంలుగా బీసీలు
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో బీసీలు రాజకీయంగా ఎదగాలి. తెలుగు రాష్ట్రాల్లో బీసీల రాజకీయ బ్లాక్‌గా ఏర్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో సుదీర్ఘకాలం బీసీలు పరిపాలించిన రాష్ట్రాల్లో బిహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటివరకు వందకు వందశాతం అగ్రకులాలే పరిపాలించారు. యాభై శాతం జనాభా ఉన్న బీసీలకు ఒక్కసారి కూడా అవకాశం రాలేదు. బీసీ వ్యవసాయ కులమైన కురిమి కులానికి చెందిన నితీశ్‌కుమార్ జేడీయూ, యాదవుడైన లాలు ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీల స్థాపించి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా నడపగలుగుతున్నారు.
ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్లలో బీసీలు రాజ్యాధికారం సాధించి సామాజిక న్యాయ ఫలాలు కొంతమేరకు పొందుతూ ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీసీల పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంది . ఉత్తరప్రదేశ్‌లో యాదవుడైన ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాది పార్టీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. బిహార్లో మంగలి కులానికి చెందిన కర్పూరీ ఠాకూర్ 1970లలోనే ముఖ్యమంత్రి కాగా ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలలో మంగలి కులానికి చెందినవారు ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేకపోయారు. యాదవుడైన లాలూ ప్రసాద్ యాదవ్ కూడా రాష్ట్రీయ జనతా దళ్ పేరుతో పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా ఇతర బీసీలను, ముస్లింలను రాజకీయాల్లో ప్రోత్సహించారు. ఉత్తరప్రదేశ్ నుంచి గంగపుత్ర కులానికి చెందిన పులన్ దేవి ను లోకసభకు పంపిములాయం సింగ్ యాదవ్ తనను బీసీ పక్షపాతిగా ప్రకటించుకున్నారు.
ఏకతాటిపైకి బీసీ కులాలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం యాదవ కులం నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక్కడ బీసీ వ్యవసాయ కులాలు, ఇతరులు కనీసం ఒక పార్టీ కూడా పెట్టుకోలేకపోయారు. బీసీలను దూరం చేయడంలో ఎప్పటికప్పుడు అగ్రకులాలు కుట్రలు చేస్తూనే ఉన్నాయి. గతంలో 9 మంది ఎమ్మెల్యేలు మున్నూరు కాపులు ఉండేవారు. ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు. ఇప్పుడిప్పుడే రాజకీయ చైతన్యం పెరుగుతున్న గౌడ్లపై ఇతర బీసీలకు వైరుధ్యం ప్రచారం చేస్తున్నారు. కురుమ యాదవుల మధ్య విభేదాలు సృష్టించి ఒకరంటే ఒకరికి ద్వేషం పెరిగేలా అగ్రకులాలు వ్యవహరిస్తున్నాయి. సాంస్కృతిక, జీవన నేపథ్యం ఒకటిగా ఉన్న కులాలు కూడా ఏకం కాలేని పరిస్థితిని ఎప్పటికప్పుడు అగ్రకులాలు సృష్టిస్తున్నాయి.
వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తూ తమ పాలన పగ్గాలు చేజారకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం సంక్షేమ పథకాల కోసమే వారిని కొట్టుకునేవిధంగా వారు కుయుక్తులు పన్నుతున్నారు. ఇకనైనా బీసీ వ్యవసాయ అనుబంధ కులాలు ఏకం కావలసిన అవసరం ఉంది. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల రాజకీయాలను ఆదర్శంగా తీసుకుని బీసీలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలను సొంతం చేసుకోవాలి. బీసీ వ్యవసాయ కులాలు, చేతివృత్తులు ఇతర అనుబంధ కులాలు ఒక బలమైన రాజకీయ శక్తిగా ఏర్పడి ఒక రాజకీయ పార్టీని వేదికగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో సోషల్ జస్టిస్ పార్టీ లాంటి రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇవి బీసీల నాయకత్వంలో కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బీసీలంతా ఏకతాటిపై నిలిచి ఈ పార్టీలకు అండగా నిలవాలి.
- చామకూర రాజు,అధ్యక్షుడు,సోషల్ జస్టిస్ పార్టీ