ఎన్నో పోరాటాలతో స్వాతంత్ర్యం వచ్చిన నాలుగు దశాబ్దాల తర్వాత సాధించుకున్న ఓబీసీ రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేస్తే వాటిలో కనీసం పావు భాగం కూడా అమలు కావట్లేదు. గొర్రెలు, బర్రెలు, చేపలు పంపిణీ చేసేందుకు పథకాలు పెట్టే పార్టీలు ఓబీసీలకు రాజ్యాధికారం ఇచ్చే విషయంలో ఆ ఉత్సాహం చూపవేం? హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేడు తెలంగాణ రాష్ట్రం వరకు ఒక్క సీఎం కూడా ఓబీసీ కులాలకు చెందిన నేత లేరంటేనే ప్రజాస్వామ్యం ఎలా అపహాస్యమవుతోందో గమనించవచ్చు. ప్రతి బీసీకీ రాజకీయాల్లో, చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం ఉంటేనే ఆ కులాల అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారం సాధ్యమవుతుంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీలకు లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో రిజర్వేషన్ ఉన్నట్లుగానే ఓబీసీలకూ రిజర్వ్ డ్ నియోజకవర్గాలను పెట్టాలి.
ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు ఉండాలి. పాలనలోనూ అందరికీ భాగస్వామ్యం, ప్రాతినిధ్యం ఉండి తీరాలి. భారత రాజ్యాంగం రూపకల్పన చేసే సందర్భంలో డ్రాఫ్టింగ్ కమిటీ ఈ స్ఫూర్తినే ఎన్నుకున్నప్పటికీ.. అనుకున్న స్థాయిలో న్యాయం చేయలేకపోయింది. అయితే పరిష్కార మార్గాలను చూపగలిగిన మాట వాస్తవం. ఆర్టికల్ 340 ఇందులో భాగంగా వచ్చిందే. మొదట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించే ఆర్టికల్స్ రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆ తర్వాత వెనుకబడిన వర్గాలకు (బీసీ) రిజర్వేషన్ కల్పించే క్రమంలో రాజ్యాంగ పరిషత్ లో ప్రస్తావించినప్పుడు వల్లభాయ్ పటేల్ అభ్యంతరం చెప్పారు. ‘వెనుకబడిన వర్గాలన్న పేరుతోనే ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ కులాలకు రిజర్వేషన్ కల్పించారు. మళ్లీ వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అంటున్నారు. రెండూ వెనుకబడిన వర్గాలే అయినప్పుడు మొదటి బీసీలు, రెండో బీసీలు అవుతారు కదా! వీరిని గుర్తించడం ఎలా’ అని ఆయన ప్రశ్నించారు. దీంతో విషయం టెక్నికల్ క్రైసిస్ లో పడిందని గ్రహించిన అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీలను వెనుకబడిన వర్గాలు అని, వీరే కాకుండా ఇంకా కొన్ని సామాజిక వర్గాలు వెనుకబడి ఉన్నాయి కనుక వాటిని ఓబీసీలు (అదర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్) అని పేర్కొన్నారు.
ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించిన నెహ్రూ
రాజ్యాంగం రూపకల్పన నాటికే ఎస్సీ, ఎస్టీలను లిస్టింగ్ చేయడంతో ఏ ఇబ్బందీ లేకుండా రిజర్వేషన్లు కల్పించడం కుదిరింది. ఒక ఆర్డర్ వేయడం ద్వారా ఆయా కులాలను గుర్తించి, రిజర్వేషన్లు అమలు చేశారు. కానీ ఓబీసీ కులాలను అప్పటికీ లిస్టింగ్ చేయడం గానీ గుర్తించడం గానీ చేయకపోవడంతో అదో పెద్ద సమస్యగా మారింది. దాంతో ఓబీసీలను గుర్తించడానికి ఒక కమిషన్ వేస్తున్నట్టు రాజ్యాంగ పరిషత్ లో ప్రకటిస్తూ దానిని ఆర్టికల్–340లో పొందుపరిచారు. ఆ కమిషన్ నివేదిక ఆధారంగా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. కానీ, నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ కమిషన్ నియమించలేదు. చందాపురి, పంజాబ్ రావ్ దేశ్ ముఖ్, చౌదరి బ్రహ్మ ప్రకాశ్, రామస్వామి పెరియార్ వంటి నాయకుల ఉద్యమాలతో ప్రభుత్వం దిగొచ్చి.. 1953లో ‘కాకా కలేల్కర్ కమిషన్’ పేరుతో మొదటి ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఓబీసీల స్థితిగతులు వెలువరించడమే గాక 2,399 కులాలను ఓబీసీ కులాలుగా గుర్తించి, వారికి రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. అంతే కాదు కులంతో సంబంధం లేకుండా దేశంలోని స్త్రీలందరినీ బీసీలుగా గుర్తించాలని సూచించింది. కానీ నెహ్రూ ‘కాకా కలేల్కర్’ను కించపరచడమే గాక ఆ రిపోర్టును పక్కనపడేశారు. స్వయంగా దేశ ప్రధాని హోదాలో అన్ని రాష్ట్రాల సీఎంలకు ఈ కమిషన్ రిపోర్టును పట్టించుకోవద్దని లెటర్స్ రాశారు.
రాజకీయ రిజర్వేషన్లు ఉండాలి
ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు పొందినా అసలు సిసలైన రాజకీయ రిజరేషన్లు లేకపోవడంతో ఓబీసీ కులాలు వెనుకబడే ఉన్నాయి. ప్రస్తుతమున్న తెలంగాణ అసెంబ్లీలో చాకలి, మంగలి, కుమ్మరి, వడ్డెర, వడ్రంగి, కమ్మరి, కంసాలి, కురుమ, గంగిరెద్దుల, బోయ, పిట్టెల, బెస్త వంటి కులాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. ఓబీసీల రాజకీయ ప్రాతినిధ్యం 20% దాటిన దాఖలాలు చరిత్రలోనే లేవు. ఆధిపత్య కులాలు ప్రతి అసెంబ్లీలో 55% నుంచి 60% వరకు స్థానాలను ఆక్రమించుకుంటున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు లోక్ సభ, అసెంబ్లీల ఎన్నికల్లో రిజర్వుడ్ స్థానాలు ఉండడంతో వాటిని ఆక్రమించుకోవడం వీలు కాక వేరే మార్గాలను చూసుకుంటున్నారు. కానీ ఓబీసీల విషయంలో ఆ ఊరట కూడా లేకుండాపోయింది. ఒకవైపు సామాజిక అణచివేత, మరోవైపు రాజకీయ దోపిడీతో ఓబీసీల పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికైనా రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి, జనాభా ప్రాతిపదికన ఓబీసీలకు కూడా అన్ని పార్టీలు సీట్లు కేటాయించేలా చట్టం రావాలి.
రాజ్యాధికారం కోసం మండల్ మహోద్యమం
మండల్ కమిషన్ ఓబీసీల అభివృద్ధికి దాదాపు 40 సిఫారసులు చేసింది. వీటిలో పావు భాగం కూడా సరిగా అమలు కావడం లేదు. దేశ ఉత్పత్తి రంగానికి వెన్నెముక లాంటి ఈ వర్గాలు నేటికీ దరిద్రంలోనే ఉన్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను వెనక్కి నెడుతుందనడంలో సందేహం లేదు. ఓబీసీలకు పారిశ్రామిక రంగంలో ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ల అమలు 8% దాటడం లేదు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పూర్తిస్థాయి అణచివేతకు గురవుతున్న ఎంబీసీ, ఓబీసీలు ఇంకా ఉద్యమ రూపాన్ని తీసుకోలేకపోతున్నాయి. ఆర్థికంగా చతికిలపడ్డ ఈ వర్గాల అభ్యున్నతికి మండల్ సిఫార్సుల అమలు, రాజకీయ ప్రాతినిధ్యం పొందడమే పరిష్కారమని గుర్తించాలి. ఓబీసీలు పాలక పక్షాలుగా మారనంత కాలం ఆ వర్గాల సమస్యలకు పరిష్కారం దొరకదని తెలుసుకోవాలి. కేసీఆర్ వరుస ఫెయిల్యూర్స్ తో తెలంగాణలో రాజకీయంగా ఏర్పడిన వ్యాక్యూంను వాడుకుని ఈసారి ఓబీసీలే అధికారంలోకి వచ్చేలా పోరాడాలి. ఈ క్రమంలోనే తెలంగాణలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ‘మండల్ మహోద్యమం’ పేరుతో జేఏసీ ఏర్పడింది. మండల్ సిఫారసుల అమలుతోపాటు ఓబీసీల్లో రాజకీయ చైతన్యం రగిలించే ధ్యేయంతో కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. శాసనసభ, పార్లమెంటు ముఖమెరగని ఓబీసీ కులాలన్నింటినీ అధికారంలో భాగస్వామ్యం చేసేందుకు పోరాటం సాగించడం తప్ప మరో మార్గం లేదు.
జనతా ప్రభుత్వం వచ్చాకనే న్యాయం
రెండు దశాబ్దాలు ఓబీసీ రిజర్వేషన్ల విషయం చర్చలో లేకుండా చేసిన నాటి పాలకులు.. ఆ కథ అక్కడితో ముగిసినట్లేనని భావించారు. 1979లో జనతాదళ్ అధికారంలోకి వచ్చాక రెండో ఓబీసీ కమిషన్ ఏర్పాటవడంతో ఆ పాలక కులాలకు ఎదురుదెబ్బ తగిలింది. బీహార్ మాజీ సీఎం బిందేశ్వరీ ప్రసాద్ మండల్ నేతృత్వంలో నియమించిన రెండో ఓబీసీ కమిషనే ‘మండల్ కమిషన్’ అయింది. 1980 డిసెంబర్ 31న ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ నాటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. 1989లో మళ్లీ జనతా సర్కార్ ఏర్పడ్డాక రిజర్వేషన్లపై కదలిక వచ్చింది. అదే సమయంలో నాటి ఓబీసీ నాయకులు లాలూప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్, ములాయం, కాన్షీరాం పోరాటాలతో 1990 ఆగస్టు 7న మండల్ సిఫారసుల్ని అమలు చేయనున్నట్లు వీపీ సింగ్ ప్రభుత్వం ప్రకటించింది. మండల్ నివేదిక ఆధారంగా 27% రిజర్వేషన్లను ఉద్యోగ రంగంలో అమలు చేయనున్నట్లు ప్రకటించగా.. ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఓబీసీ రిజర్వేషన్లపై రెండేళ్ల తర్వాత 1992లో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో దోపిడీ పాలక కులాలు సైలెంట్ అయ్యాయి. -డా. కదిరె కృష్ణ, స్టేట్ ప్రెసిడెంట్, బహుజన సేన
బీసీలకూ రిజర్వ్‌డ్ నియోజక వర్గాలు ఉండాలె
- వెలుగు ఓపెన్ పేజ్
- December 25, 2020
లేటెస్ట్
- విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
- బుద్వేల్లో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన DCM
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- హైదరాబాద్ నడిబొడ్డున రూ.11 లక్షల నకిలీ సిగరెట్లు సీజ్
- బీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- తిండైన మానేస్తారు కానీ వాళ్ళు అది మాత్రం ఆపరు: రాశీ కన్నా
- షమీ వచ్చేశాడు.. ఇక వార్ వన్ సైడే: 14 నెలల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ
- గుండెపోటుతో తాటిచెట్టుపైన గీతకార్మికుడు మృతి
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- బుజ్జితల్లి వీడియో సాంగ్ రిలీజ్.. ఎమోషనల్ ట్రీట్ ఇచ్చారుగా..
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- Fateh Box Office: గేమ్ ఛేంజర్కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- కాంటినెంటల్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ
- Daaku Maharaj: డాకు మహారాజ్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?