కేసీఆర్ కుటుంబ అవినీతిని బయటపెడతా..

కేసీఆర్ కుటుంబ అవినీతిని బయటపెడతా..
  • ప్రజాశాంతి పార్టీ చీఫ్​ కేఏ పాల్  
  • దళిత సీఎం లాంటిదే బీసీ నినాదం
  • కవిత కొత్త వేషంతో ముందుకొస్తున్నది   

నిజామాబాద్​: పదేండ్లు బీఆర్ఎస్ కు అధికారం కట్టబెడితే దరిద్ర, అవినీతి, అక్రమ పాలనతో రాష్ట్రాన్ని ఆగం చేసిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏపాల్​విమర్శించారు. రూ.లక్షన్నర కోట్ల మిగులు ఆదాయం కలిగిన రాష్ట్రాన్ని కేసీఆర్​పదేండ్లలో రూ.7లక్షల కోట్ల అప్పులు చేసి దివాళా తీయించారని ఆరోపించారు. సోమవారం ఆయన నిజామాబాద్​సిటీలో మీడియాతో మాట్లాడారు. జైలుకు వెళ్లకముందు మహిళల కోసం పోరాడుతున్నానని చెప్పిన  కవిత వర్కవుట్ కాకపోవడంతో ఇప్పుడు బీసీ నినాదంతో కొత్త వేషంతో ముందుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. 

దొరల కుటుంబమైన కేసీఆర్​, కేటీఆర్, కవిత బీసీ నినాదాన్ని ఎలా ఎత్తుకుంటారని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన తరహాలోనే బీసీ నినాదంతో మోసగిస్తారన్నారు. ఎన్నికలప్పుడు తన ఆస్తులు రూ.25 లక్షలని తెలిపిన కవిత దుబాయ్​లో రూ.25 కోట్ల విలువైన ఇల్లు ఎలా కొన్నారో చెప్పాలని డిమాండ్​చేశారు. రూ.లక్షల కోట్లు సంపాదించిన కేసీఆర్​కుటుంబ అవినీతి, అక్రమాల చిట్టా తన వద్ద ఉందని మూడు రోజుల్లో బయటపెడతానన్నారు. రాజకీయ అణిచివేత ఎదుర్కొంటున్న బీసీలంతా కాంగ్రెస్​, బీఆర్ఎస్​ నుంచి బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 

ప్రజాశాంతి పార్టీ కండువా మెడలో వేసుకుని సర్పంచ్​లుగా గెలవాలని కోరారు.  ఉచిత విద్య, వైద్యాన్ని తన ఫౌండేషన్ ​ద్వారా అందిస్తానన్నారు. అపాయింట్​ఇవ్వని బిల్​గేట్స్​ను చంద్రబాబుకు,  ప్రధాని దేవేగౌడకు తానే పరిచయం చేశానని పేర్కొన్నారు. డోనాల్డ్​ట్రంప్​ కూతురు ఇవాంక ట్రంప్ ​హైదరాబాద్​వస్తే కేసీఆర్, కేటీఆర్, కవిత ఆమెతో కలిసి డ్యాన్స్​లు చేశారని ఎద్దేవా చేశారు. ఎవరైనా తనతో పెట్టుకుంటే దైవ బటన్​నొక్కుతానని వారు హుష్​కాకేనని ఆయన పేర్కొన్నారు. 

వందరోజుల్లోనే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం

ఆదిలాబాద్​ టౌన్ : రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వంద రోజుల్లో ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​ ప్రకటించారు. సోమవారం ఆదిలాబాద్ టౌన్ కు వచ్చిన ఆయన స్థానికంగా ప్రైవేట్​ఫంక్షన్​ హాల్​లో నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడారు. గ్రామాల అభివృద్ధే తమ ముఖ్య ఉద్దేశమన్నారు.  గ్రామాల్లో సర్పంచులుగా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వంద రోజుల్లోనే అభివృద్ధి చేసి చూపుతామన్నారు.