ఇండియా కూటమికే..బీసీల మద్దతు!

ఇండియా కూటమికే..బీసీల మద్దతు!

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌‌‌‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌‌‌‌ నేతృత్వంలోని ఇండియా కూటమికి బీసీలు మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే.. దేశంలో బీసీల జనాభా సుమారు 60% ఉంటే రిజర్వేషన్లు మాత్రం 27% మాత్రమే. కానీ, అగ్రవర్ణాలవారు 10%  ఉంటే వారికి ఆర్థిక బలహీనవర్గాల పేరుతో 10% రిజర్వేషన్లు మోదీ సర్కారు కల్పించింది.  కేంద్రంలో ప్రధానితోపాటు 78మంది మంత్రులు, అలాగే 58 మంత్రిత్వశాఖలు ఉంటే బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ లేదు.  ‘బీసీ కులగణ’ను  ఎన్డీయే సర్కారు నిర్వహించదు. ఈ దేశాన్ని పాలించిన బ్రిటీష్‌‌‌‌  తెల్లదొరలు 1872 నుంచి 1931 వరకు కులగణన చేశారు.

కానీ, ఈ మన నల్లదొరలకు ఆ సోయి కూడా లేకుండా పోయింది.  చట్టసభలలో  ఎస్సీ/ఎస్టీల వలే, బీసీలకు కూడా రిజర్వేషన్‌‌‌‌ లేకపోవడం వలన స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటివరకు లోక్‌‌‌‌సభ, అసెంబ్లీలలో బీసీల ప్రాతినిధ్యం ఏనాడూ 18% దాటలేదు. 10-–07-–2019 కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీల శాతం 21.57% మాత్రమే. మండల సిఫారసుల ప్రకారం 27% కంటే తక్కువ.  ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ లకు  జనాభాపరంగా  రిజర్వేషన్లు కల్పించి 60%  బీసీలకు మాత్రం 27% రిజర్వేషన్లపై  క్రిమిలేయర్‌‌‌‌ విధించారు.

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషను ఉండవు.  దేశంలో ఎవరికీ లేని క్రిమిలేయర్‌‌‌‌  బీసీలపై రుద్ది బీసీలను ఐఏఎస్‌‌‌‌, ఐపీఎస్‌‌‌‌,  గ్రూప్‌‌‌‌-1 ఉద్యోగాలకు దూరం చేస్తున్నారు.  మహిళా బిల్లులో బీసీ మహిళలకు మాత్రం సబ్‌‌‌‌కోటా కూడా ఉండదు.  బీసీల కులగణన చేయరు. మండల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ సిఫారసులు పూర్తిగా అమలు చేయరు. ఈనేపథ్యంలో బీసీలు ఈ ఎన్నికలలో బీసీ సామాజిక సాధికారత కోసం కీలకపాత్ర పోషించాల్సిందే.

బీసీలపై బీజేపీ ద్వంద్వ వైఖరి       

ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు,  గల్లీ ఎన్నికలు కావు.  దేశంలోని 75  కోట్ల మంది ఓబీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే వాస్తవాలను, చరిత్రను గమనించి నిర్ణయాలు తీసుకోవాలి.  స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటిసారి ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన నరేంద్ర మోదీ  ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పటికీ బీసీలకు ఆయన వలన జరిగిన మంచి శూన్యం.  పైగా  రాజ్యాంగ మౌలిక సూత్రాలు, కోర్టుల తీర్పులకు వ్యతిరేకంగా, ఆర్థికంగా బలహీన వర్గాలు అంటూ అగ్రవర్జాలకు 103 రాజ్యాంగ సవరణ ద్వారా 10% రిజర్వేషన్లు తెచ్చి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2010లో  బీజేపీ అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌‌‌‌ పార్టీని 2010లో కులగణన చేయాలని డిమాండ్‌‌‌‌ చేసింది.  రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 31,  2018న కేంద్ర హోం మంత్రి రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌సింగ్‌‌‌‌ 2021లో కులగణన చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ, బీజేపీ ప్రభుత్వం స్టేట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ మహారాష్ట్ర  వర్సెస్‌‌‌‌  యూనియన్‌‌‌‌  ఆఫ్‌‌‌‌ ఇండియా కేసులో  కులగణన కేసు నెంబరు డబ్ల్యూపీ. సివిల్‌‌‌‌  నెం841/2021లో  తేది 21– -09–-2021న  కులగణన చేయమని స్పష్టమైన అఫిడవిట్‌‌‌‌ దాఖలు చేసింది.  ఇది వాస్తవం కాదా? 

బీసీలపై మోదీ సర్కారు వివక్ష

దేశంలోని 45 కేంద్ర విశ్వ విద్యాలయాలలో 45 వైస్‌‌‌‌ చాన్సలర్‌‌‌‌లుంటే వారిలో ఎస్సీలు-1, ఎస్టీలు-1, ఓబీసీలు -ఏడుగురు మాత్రమే (లోక్‌‌‌‌సభలో 08-–08-–2022 విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్‌‌‌‌ శంకర్‌‌‌‌  సమాధానం) ఇదీ వారి ద్వంద్వ వైఖరి.  గత పది సంవత్సరాల బీజేపీ పాలనలో బీసీలకు ఏమి చేయలేదని, ఏమి చేయమని కుండబద్దలు కొట్టినట్టుగా బీజేపీ చెప్పకనే చెబుతోంది. బీజేపీ..బీసీ వ్యతిరేక వైఖరిని బీసీ ప్రజలు గమనించగలరని మా మనవి.  గతంలో బీజేపీ మండల్‌‌‌‌కు వ్యతిరేకంగా రామ్‌‌‌‌ మందిర్‌‌‌‌ నిర్మాణ సమస్యపై  కమండల్‌‌‌‌ ఉద్యమాన్ని నడిపింది.

అప్పటి ప్రధాని వీపీ.సింగ్‌‌‌‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి కూలగొట్టింది.  మండల్‌‌‌‌కు వ్యతిరేకమని స్పష్టంగా చెప్పింది. కాలానుగుణంగా బీజేపీ  వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందంటే అదీ లేదు. మరోవైపు  కాంగ్రెస్‌‌‌‌ పార్టీ మేనిఫెస్టోలో మాత్రం ఐదు న్యాయాలలో ఒకటైన  హిస్సేదార్‌‌‌‌ న్యాయంలో తాము అధికారంలోకి వస్తే సామాజిక, ఆర్థిక, కులం సెన్సెస్‌‌‌‌ చేస్తామని,  అదేవిధంగా సామాజిక రిజర్వేషన్లపై ఉన్న 50% సీలింగ్‌‌‌‌ను ఎత్తివేసి బీసీ రిజర్వేషన్దు జనాభా ప్రకారం పెంచుతామంటోంది. అలాగే 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేసింది.

ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకొద్దాం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కులగణన చేయడం,  స్థానిక సంస్థల ఎన్నికలలో 34 శాతం రిజర్వేషన్‌‌‌‌ తీసుకురావడమే ప్రధాన లక్ష్యం.  తెలంగాణ రాష్ట్రంలో  కులగణన చేయాలని కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి,  ప్రభుత్వపరంగా జీవో  నెం.26 ను విడుదల చేసి రూ.150 కోట్ల బడ్జెట్‌‌‌‌ను కేటాయించింది.  రాష్ట్రంలోలాగానే  కేంద్రంలో కూడా కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి రాగానే కులగణ నపై మొదటి సంతకం పెడతానని హామీ ఇచ్చింది.

గతంలో మండల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ సిఫారసులను 2013 సెప్టెంబర్‌‌‌‌లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమలుచేసిన చరిత్ర కాంగ్రెస్‌‌‌‌కు ఉంది. 2006లో  93వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర విద్యాలయాలలో రిజర్వేషన్‌‌‌‌ తెచ్చిన ఘనత వీరిదే.  కాబట్టి, కాంగ్రెస్​ మాటలను విశ్వసిద్దాం.  హస్తం పార్టీ మేనిఫెస్టోను నమ్ముదాం.  మనమందరం మద్దతు ప్రకటిద్దాం, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌‌‌‌ నేతృత్వంలోని ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకొద్దాం. జై ఫూలే-.. జై బీసీ.

బీసీ కులగణన చేయకపోతే..నష్టం ఏమిటి?

బీసీ కులాల లెక్కలు లేకపోవడం వలన కోర్టులలో బీసీ రిజర్వేషన్‌‌‌‌లకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాయి.  దీనికి ఉదాహరణ- మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో 34 శాతం రిజర్వేషన్లను 18 శాతంకు కుదించటం. కులాల లెక్కలు లేకపోవడం వలన విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాలలో బీసీలకు చెందాల్సిన న్యాయబద్ధమైన వాటా బీసీలకు చెందడం లేదు. బీసీ కులాలు లెక్కలు లేకపోవడం వలన సమగ్ర బీసీ ప్రణాళికలు తయారు చేయలేకపోతున్నారు. ఈరోజు బీసీ కులాలలో ఉన్న అన్ని రంగాలలో ఉన్న వెనుకబాటుతనం ఇక వేరే కులాలలో లేవు.  

బీసీ కులాల లెక్కలు లేకపోతే శాసించే వాళ్ళం కాకుండా యాచించేవారం అవుతాం. సామాజిక న్యాయం మనకు అందని ద్రాక్షపండే అవుతుంది. కాగా, బీసీలకు ప్రాధాన్యమివ్వని బీఆర్ఎస్ పార్టీ బీసీలను కుట్రపూరితంగా అణచివేసింది. రాష్టంలో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్.. ఈ పార్టీ నిర్వాకం వలనే స్టానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 18 శాతంకు  తగ్గిపోయాయి. ఏనాడు మంత్రివర్గంలోగానీ, శాసనసభలోగానీ  బీసీలకు తగిన  ప్రాధాన్యం ఇవ్వలేదు. కాబట్టి, ఈ బీఆర్ఎస్​ పూర్తిగా బీసీ వ్యతిరేక పార్టీ.  అందుకే, కాంగ్రెస్‌‌‌‌ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను అమలుచేస్తుందని సంపూర్ణంగా  విశ్వసిస్తున్నాం. 

జాజుల శ్రీనివాస్‌‌‌‌ గౌడ్, 
జాతీయ అధ్యక్షుడు, 
బీసీ సంక్షేమ సంఘం