- ప్రభుత్వ పథకాలు, ఓట్ల చీలికపై గొంగిడి సునీత ఆశలు
- ప్రభుత్వ వ్యతిరేకతే గెలిపిస్తుందని కాంగ్రెస్ ధీమా
- స్టూడెంట్లు, యువ ఓటర్లపై బీజేపీ భరోసా
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో బీసీలు వర్సెస్ రెడ్డిగా మారింది. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు నామమాత్రంగా పోటీలో ఉండగా ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ కు దీటుగా దూసుకెళ్తున్నారు. దీంతో ఆలేరులో సమీకరణాలు మారే అవకాశం కన్పిస్తోంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మూడోసారి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పడాల శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి బీర్ల అయిలయ్య బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీలో ఉన్న బీసీ సామాజికవర్గాలకు చెందిన అభ్యర్థులు రాజకీయాలకు కొత్తవారు. వీరిద్దరూ తొలి ప్రయత్నంలోనే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
హ్యాట్రిక్ పై సునీత ధీమా
వరుసగా రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే గొంగిడి సునీత మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే, ఇప్పటికే రెండుసార్లు గెలిచిన సునీతకు ఎదురుగాలి వీస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పథకాల వైఫల్యాలపై ఎమ్మెల్యేను స్థానికులు పలుచోట్ల అడ్డుకున్నారు. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ లో కొంత ఆందోళన నెలకొంది. అయితే, ప్రత్యర్థులే దుష్ర్పచారం చేస్తున్నారని బీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. గతంలో మోత్కుపల్లి నర్సింహులు వరుసగా ఐదుసార్లు గెలిచిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఏ స్కీమ్ అయినా అందరికీ ఒకేసారి ఇవ్వలేమంటున్నారు. తొమ్మిదన్నరేండ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై ఎమ్మెల్యే సునీత ప్రచారం చేస్తున్నారు. పింఛన్లు, రైతుబంధు సహా ఇతర స్కీమ్స్‌లో లబ్ధి పొందిన వారిని టార్గెట్‌గా చేసుకొని ఆమె ప్రచారం చేస్తున్నారు. వీరి ఓట్లకు మరికొన్ని ఓట్లు కలిస్తే తాను హ్యాట్రిక్ సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు గతంలో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బూడద భిక్షమయ్య గౌడ్ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు. ఈసారి గెలిస్తే.. మహిళా కోటాలో మంత్రి పదవి వస్తుందని, అదే జరిగితే ఆలేరు అభివృద్ది మరింత వేగంగా జరుగుతుందని ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు.
గట్టిపోటీ ఇవ్వనున్న కాంగ్రెస్
2014 నుంచి వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్కు కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చి ఓడిపోయింది. రెండుసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య ఇప్పుడు బీఆర్ఎస్లో చేరిపోయారు. దీంతో ఈసారి కాంగ్రెస్ తరపున బీర్ల అయిలయ్య పోటీ చేస్తున్నారు. గడిచిన మూడేండ్లుగా నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తూ ప్రజలకు ఆయన సుపరిచితుడిగా మారారు. ప్రస్తుతం ప్రచారంలో దూసుకొనిపోతున్నారు. రెండుసార్లు గెలిచిన సునీతపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తితో పాటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. పైగా బీసీ సామాజికవర్గంలో బలమైన వర్గం తమకు అండగా ఉందని భావిస్తున్నారు. అయితే, అయిలయ్యకు సొంత పార్టీ లీడర్ల నుంచి సహకారం కరువైంది. టికెట్ ఆశించిన వారందరూ పార్టీకి దూరమయ్యారు. వారిని దగ్గర చేసుకునే ప్రయత్నం అయిలయ్య చేయలేదని కొందరు అంటున్నారు. తనకు సహకరించాలని అయిలయ్య కోరినా అసంతృప్తులు సహకరించడం లేదని చెబుతున్నారు.
నామమాత్రం నుంచి దీటుగా బీజేపీ
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విద్యా సంస్థలు కలిగిన ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పడాల శ్రీనివాస్ ఈసారి బీజేపీ నుంచి బరిలోకి దిగారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు దీటుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ను ఇరుకున పెట్టేలా గంధమల్ల రిజర్వాయర్ అంశాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. బీసీలోని మరో బలమైన సామాజికవర్గానికి చెందిన ఆయన.. తనకు పార్టీ సంప్రదాయ ఓట్లతో పాటు తన సామాజికవర్గానికి చెందిన వారి ఓట్లు పడతాయని ఆశిస్తున్నారు. పైగా ఏండ్ల తరబడి విద్యా సంస్థలు నిర్వహిస్తున్నందున ఓటుహక్కు వచ్చిన తన స్డూడెంట్లు తనకు ఓటు వేస్తారని భావిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే సునీతతో విభేదాల కారణంగా బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన శ్రీనివాస్ .. ఆ పార్టీలో తనకు అసంతప్తి నేతల సహకారం ఉంటుందని ఆశిస్తున్నారు. ఈ పరిణామాలతో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఆర్ఎస్ఎస్ కూడా రంగంలోకి దిగింది. ఆర్ఎస్ఎస్కు నియోజకవర్గంలో 20 వేల మంది కార్యకర్తలు ఉన్నారు.
2018లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లు
బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత -94,870
కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్య - 61,784
బీఎస్పీ అభ్యర్థి కల్లూరి రాంచంద్రారెడ్డి - 11,923
బీఎల్ఎఫ్ పీ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు - 10,473
బీజేపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి - 4,967
బీసీ ఓట్ల చీలికపై బీఆర్ఎస్ ఆశలు
ఆలేరు నియోజకవర్గంలో 2,33,266 ఓట్లు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనారిటీ ఓట్లు కలిపి 90 వేలకు పైగా ఉన్నాయని అంచనా. మిగిలిన ఓట్లన్నీ బీసీలవే. వాటిలో గౌడ్లు, ముదిరాజులు, కురుమ, యాదవ, పద్మశాలి, మున్నురుకాపు సహా ఇతర కులాలకు చెందినవే. వాటిలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల సామాజికవర్గాలకు చెందిన ఓట్లు 50 వేలకు పైగా ఉన్నాయి. ఇద్దరు బీసీ సామాజికవర్గానికే చెందిన వారే కావడంతో ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉన్నాయి. బీసీల ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు ఎవరికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీసీల ఓట్లు కచ్చితంగా చీలిపోతాయని, తద్వారా తమకు లాభం జరుతుందని బీఆర్ఎస్ ఆశిస్తోంది.