బీసీ డిక్లరేషన్‌‌ ఏమైంది?

గత ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్‌‌ పేరుతో వేసిన ప్రజాప్రతినిధుల కమిటీ సిఫార్సులు పత్తా లేకుండా పోయాయి. బీసీ ప్రణాళిక కోసం ప్రభుత్వం బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో బీసీ కమిటీ వేసి ఆర్భాటం చేసింది.  రూ.20 వేల కోట్లతో బీసీలకు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని, విద్య, ఉద్యోగాల్లో 52 శాతం రిజర్వేషన్ల అమలుతోపాటు క్రీమిలేయర్‌‌ తొలగించాలని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 32 నుంచి 52 శాతానికి పెంచాలనే డిమాండ్లు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. ఏండ్లుగా ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయి. జనాభాలో దాదాపు 55 శాతం ఉన్న బీసీలకు జనాభా ప్రకారం చట్టసభల్లో అవకాశం దక్కడం లేదు. బీసీలు ఎప్పుడూ పాలితులుగానే ఉంటున్నారు. అయిదు నుంచి 10 శాతం ఉన్న కొన్ని పెద్దకులాలే అధికారంలోకి వచ్చి పాలిస్తున్నాయి. ఇప్పుడు హుజూరాబాద్‌‌ ఉప ఎన్నికలో గెలుపొందడమే లక్ష్యంగా దళిత బంధు స్కీం పేరుతో దళితులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూ పంపిణీకి ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఇప్పుడు మళ్లీ కొత్తగా కుటుంబానికి రూ.10 లక్షలు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో బీసీలు, దళితులకు అన్యాయం జరుగుతోంది.  ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
- ఎర్ర సత్యనారాయణ, ప్రెసిడెంట్
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం