కేబినెట్ ​విస్తరణలో బీసీలకు ప్రయారిటీ.. భవిష్యత్తులో కాంగ్రెస్​ నుంచి బీసీ సీఎం: పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

కేబినెట్ ​విస్తరణలో బీసీలకు ప్రయారిటీ.. భవిష్యత్తులో కాంగ్రెస్​ నుంచి బీసీ సీఎం: పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​
  • ఈ ఐదేండ్లు రేవంత్​రెడ్డే ముఖ్యమంత్రి
  • కులగణన నిర్వహించడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగనున్న కేబినెట్​ విస్తరణలో బీసీలకు ప్రాధాన్యం ఉంటుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్​ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో  భవిష్యత్తులో కాంగ్రెస్ తరఫున బీసీలే సీఎం అవుతారని చెప్పారు. సోమవారం గాంధీభవన్​లో కాంగ్రెస్ ఓబీసీ సెల్​ జాతీయ  చైర్మన్ అజయ్ సింగ్ యాదవ్​తో కలిసి మహేశ్ ​కుమార్ ​గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. . బీసీ సీఎం అనేది కాంగ్రెస్​తోనే సాధ్యమని పేర్కొన్నారు. 

ఈ ఐదేండ్లూ రేవంత్ రెడ్డియే సీఎంగా కొనసాగుతారని వెల్లడించారు. బీసీల విషయంలో తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే కుల గణన చేశామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్​లకు బీసీలపై ప్రేమలేనందునే కులగణనను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాబోయే ఎన్నికలు బీసీల చుట్టే తిరగనున్నాయని చెప్పారు.

‘బ్యాన్ ఈవీఎం’ అనే కొత్త నినాదాన్ని జాతీయస్థాయిలో కాంగ్రెస్ తీసుకుందని కాంగ్రెస్ ఓబీసీ సెల్​ చైర్మన్ అజయ్ సింగ్ యాదవ్ చెప్పారు. మహారాష్ట్ర , హర్యానా రాష్ట్రాల్లో పార్లమెంట్​ఎలక్షన్స్, అసెంబ్లీ ఎన్నికకు మధ్యలో ఓటర్లు పెరిగారని, ఇదెలా సాధ్యపడిందని ప్రశ్నించారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలను నిర్వహించాలనేది కాంగ్రెస్ విధానమని చెప్పారు. 

తెలంగాణ కుల గణన దేశానికే దిశా నిర్దేశం అవుతుందని అన్నారు. ఇది గేమ్ చేంజర్ గా మారబోతున్నదని తెలిపారు.  దేశంలోని 40 శాతం సంపద సమాజంలో ఒక్క శాతం ఉన్న వారి వద్దనే ఉందన్నారు. ఏ రంగాల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నత స్థానాల్లో లేరని చెప్పారు.  కాంగ్రెస్ ను ముస్లింల పార్టీ అని ముద్ర వేశారని, దేశంలోని అన్ని కులాలు, మతాలను  గౌరవించే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని వెల్లడించారు. 

బీజేపీ అగ్ర నేత అద్వానీ ఇద్దరు కూతుళ్లు ముస్లింలను పెండ్లి చేసుకున్నారని, మరో అగ్రనేత మురళీ మనోహర్ జోషి కూతురు ముస్లింను వివాహమాడారని గుర్తుచేశారు.