నిజామాబాద్ సిటీ, వెలుగు : లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్ తెలిపారు. బుధవారం నిజామాబాద్ పట్టణంలోని ధర్నా చౌక్ వద్ద వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయక్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వంద శాతం లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల ముంగిట్లోకి తేవడం జరిగిందని వికసిత్ భారత్ సంకల్పయాత్ర జిల్లా నోడల్ అధికారి , ఎల్ డీఎం యు.నాగ శ్రీనివాసరావ్ అన్నారు.
కార్యక్రమంలో ఎన్ వైకె జిల్లా కోఆర్డినేటర్ శైలి బెల్లాల్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బసవ లక్ష్మీ నరసయ్య, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ అరవింద్ కుమార్ రవి, బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎన్ రాజు పాల్గొన్నారు.