హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లు, సీనియర్ నేతలు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని.. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని పీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఏజెంట్ దగ్గర 17 సీ లిస్టు ఉండేలా చూసుకోవాలని.. ఈవీఎం ఓట్లకు, 17 సీ లిస్టు ఓట్లకు తేడా వస్తే వెంటనే కౌంటింగ్ సెంటర్లలోని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ప్రతి అభ్యర్థి, వారి తరఫున వ్యవహరించనున్న ఏజెంట్లు వీటన్నింటిపై పూర్తి అవగాహనతో ఉండాలని చెప్పారు.
సోమవారం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచే రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు, వారి ఏజెంట్లు, పార్టీ ముఖ్యనేతలతో జూమ్ లో సమావేశమయ్యారు. ఇందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాలను చూసే ఏఐసీసీ సెక్రటరీలు రోహిత్ చౌదరి, విష్ణునాథ్, మన్సూర్ అలిఖాన్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, లోక్ సభ నియోజకవర్గాలకు ఇన్చార్జులుగా ఉన్న మంత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓట్ల కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు, వారి తరఫున ఏజెంట్లు ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేశారు.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమవుతుందని, ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారిని మాత్రమే పార్టీ అభ్యర్థులు తమ తరఫున ఏజెంట్‌గా కౌంటింగ్ సెంటర్లకు పంపాలని సూచించారు. అవసరమైతే పార్టీ సీనియర్ నాయకులను కూడా అక్కడికి తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. ప్రతి రౌండ్లో జరిగే కౌంటింగ్ ను నిశితంగా పరిశీలించాలని చెప్పారు. హోరాహోరీగా పోరు సాగిన లోక్‌సభ సెగ్మెంట్లలో మరింత అలర్ట్‌గా ఉండాలన్నారు.