
తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.శనివారం(మార్చి22) రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో వడగండ్ల వానలు పడే ఛాన్స్ ఉందని..ఆయా జిల్లాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఇక హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో యాచారం, మహేశ్వరం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని చౌటుప్పల్ లో వడగళ్ల వాన నల్గొండ, జనగాంలోని కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానలు బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వెల్లడించింది. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ అంతటా బలమైన ఈదురు గాలులతో తుఫాను, హైదరాబాద్ లో కూడా వర్షం కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది.
ALSO READ | Hyderabad Rains: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. హైదరాబాద్కు భారీ వర్ష సూచన
నిన్న(శుక్రవారం) తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులు,ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో వడగండ్ల వాన పడుతోంది. ధర్మపురి మండలంలో గాలి దుమారం, వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. నేరేల్ల, తుమ్మేనాల, ధర్మపురి, తిమ్మాపూర్‌తో పాటు పలు గ్రామాల్లో మోస్తరునుంచి తేలికపాటి వర్షం కురిసింది. వడంగండ్ల వానకు పలు చోట్ల మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో కూడా భారీ వర్షం కురిసింది.