వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్త! అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచన

వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్త! అలహాబాద్  హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ: ఓ రేప్  కేసులో బాధితురాలే కష్టాన్ని కొనితెచ్చుకున్నదని అలహాబాద్  హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. జడ్జీలు వ్యాఖ్యలు చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఓ వ్యక్తి నిరుడు డిసెంబరులో అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడికి అలహాబాద్  హైకోర్టు ఈనెల 11న బెయిల్  మంజూరు చేసింది. ఫిర్యాదు చేసిన మహిళ, నిందితుడు కలిసి మద్యం తాగారని, అనంతరం నిందితుడి ఇంటికి ఆ మహిళ వెళ్లి తానే కష్టాన్ని కొనితెచ్చుకున్నదంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. 

కాగా.. బాలిక వక్షోజాలు పట్టుకోవడం, ఆమె పైజామా నాడాను లాగడం వంటివి అత్యాచారం కాదని, అంతేకాకుండా అలాంటి నేరం అత్యాచారయత్నం కిందికి కూడా రాదని ఇదే అలహాబాద్  హైకోర్టు ఈ ఏడాది మార్చి 17న వ్యాఖ్యానించింది. దీంతో ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేస్తున్నది. జస్టిస్ బీఆర్  గవాయ్, జస్టిస్  అగస్టీన్  జార్జ్  మాసిహ్​తో కూడిన బెంచ్  ముందుకు ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా బెంచ్.. అలహాబాద్  హైకోర్టు ఈనెల 11న చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. 

‘‘నిందితుడికి బెయిల్  మంజూరు చేయడం జడ్జీల విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కేసులో పరిస్థితులు చూసి నిందితులకు బెయిల్  ఇవ్వవచ్చు. అయితే, ఫిర్యాదు చేసిన మహిళను అవమానించేలా హైకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ మహిళే నిందితుడి ఇంటికి వెళ్లి కష్టాన్ని తెచ్చుకున్నది అని పేర్కొనడం సరికాదు. అలా వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి” అని బెంచ్  సూచించింది.